దెబ్బకు డబ్బింగ్ సినిమాలు మానేస్తాడేమో..

Update: 2017-04-09 11:17 GMT
శతమానం భవతి.. నేను లోకల్ లాంటి బ్లాక్ బస్టర్లతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు దిల్ రాజు. ఐతే ఆయన్ని ఫిబ్రవరిలో ‘ఓం నమో వేంకటేశాయ’ దెబ్బ కొట్టింది. ఆ సినిమా రాజు నమ్మకాన్ని నిలబెట్టలేకపోయింది. కాకపోతే ‘ఓం నమో..’ అడ్వాన్స్ మీద తీసుకున్న సినిమా కావడంతో రాజు నిండా ఏమీ మునిగిపోలేదు. ఐతే రాజు బేనర్ నుంచి వచ్చిన కొత్త సినిమా ‘చెలియా’ మాత్రం ఆయన్ని పెద్ద దెబ్బే కొట్టేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.7.5 కోట్లు పెట్టి తీసుకున్నాడట రాజు. రెండేళ్ల కిందట వచ్చిన మణిరత్నం సినిమా ‘ఓకే బంగారం’ సక్సెస్ కావడం.. పైగా కార్తికి తెలుగులో మార్కెట్ ఉండటంతో రాజు ధైర్యం చేసి ఎక్కువ రేటే పెట్టాడు.

ఐతే సినిమాకు బ్యాడ్ టాక్ రావడం.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో షేర్ రూ.65 లక్షలు మాత్రమే రావడంతో రాజుకు భారీ నష్టాలు తప్పేట్లు కనిపించట్లేదు. నిజానికి ‘ఓకే బంగారం’ కూడా రాజుకు పెద్దగా మిగిల్చిందేమీ లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు ఓ మోస్తరుగానే వచ్చాయి. రాజు స్థాయికి ఆ సినిమాకు వచ్చిన లాభాలు నామమాత్రం. ఇక గత ఏడాది రాజు నుంచి వచ్చిన మరో డబ్బింగ్ మూవీ ‘పోలీస్’ ఆయనకు నిరాశనే మిగిల్చింది. పెట్టుబడి వెనక్కి రాలేదు. అలాగే ‘రెమో’ సంగతి కూడా తెలిసిందే. ఆ సినిమాకు రాజు పెట్టుబడి ఏమీ పెట్టలేదు. కేవలం ఆయన పేరు వాడుకుని డబ్బులిచ్చేట్లు ఒప్పందం కుదిరింది. దాని వల్ల రాజుకు ఎంత ముట్టిందో కానీ.. పేరు మాత్రం పోయింది. ఇప్పుడు ‘చెలియా’తోనూ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తానికి డబ్బింగ్ సినిమాలతో రాజు సంపాదించుకుంటున్నది ఏమీ లేకపోగా.. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు రెండూ పోతున్నాయి. కాబట్టి ఆయన ఇకపై డబ్బింగ్ సినిమాల జోలికి పోకపోవచ్చేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News