వేలం పాటలా హీరోయిన్ రెమ్యునరేషన్

Update: 2018-07-24 13:06 GMT
సినిమాలు ఆలస్యం అయ్యే కొద్దీ బడ్జెట్ పరంగానే కాదు నటీనటుల పారితోషికం విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. మొత్తంగా నిర్మాతకు అది తలకు మించిన భారం అయిపోతుంది. సుందర్ సి దర్శకత్వంలో ఆర్య-జయం రవి హీరోలుగా మెర్సల్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లు తీసిన  తేనండ్రాల్ సంస్థ నిర్మించ తలపెట్టిన భారీ ఫాంటసీ చిత్రం సంఘమిత్ర ఆగిపోయిందనే అనుకున్నారు అందరు. ముందు శృతి హాసన్ ను ఒప్పించి ఫోటో షూట్ చేయించి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసిన తర్వాత ఇది ఆగిపోయింది. తనకు పూర్తి కథ చెప్పకుండా ఎక్కువ డేట్లు అడిగిన కారణంగా తాను తప్పుకుంటున్నట్టు శృతి ప్రకటించాక ఇది చాలా కాలం ముందుకు కదల్లేదు. తర్వాత సుందర్ సి ఓ కామెడీ మూవీని కూడా పూర్తి చేసుకుని విడుదల చేసుకున్నాడు. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందబోయే సంఘమిత్రకు ఇప్పుడు అడుగులు వేగంగా పడుతున్నాయట. దిశా పటానిని టైటిల్ రోల్ కి మాట్లాడుకుని ఐదారు నెలల క్రితమే 3 కోట్ల రెమ్యునరేషన్ మీద ఒప్పందం కూడా చేసుకున్నారు.

కానీ దిశా పటాని ఇప్పుడు మాట మార్చేసిందని టాక్. 3 కాదు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. దానికి కారణం లేకపోలేదు. సంఘమిత్ర ఒప్పుకునే టైంకి దిశా చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన అబ్బాస్ ఆలీ దర్శకత్వంలో భరత్ చేస్తోంది. ఇది తన కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్తుంది అనే అంచనాలో ఉంది దిశా. రేంజ్ పెరిగింది కాబట్టి 5 కోట్లు ఇస్తేనే చేస్తానని చెప్పడంతో విధి లేని పరిస్థితిలో సదరు నిర్మాత ఒప్పుకున్నట్టు తెలిసింది. షూటింగ్ ఎప్పుడు  స్టార్ట్ అవుతుందనే వివరం మాత్రం తెలియడం లేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ బడ్జెట్ సినిమాలు తెలుగులో ఊపందుకున్నాయి. సాహో-సైరా లాంటివి జాతీయ మీడియాను సైతం ఆకర్షిస్తున్నాయి. కానీ తమిళ్ లో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఆ లోటు పూడ్చుకునేందుకు సంఘమిత్రను కోలీవుడ్ క్లాసిక్ మూవీగా తీర్చిదిద్దాలని సుందర్  టార్గెట్. ఆదిలోనే ఇన్ని అవాంతరాలు  ఎదురుకుంటున్న సంఘమిత్ర జరిగేదెన్నడో వచ్చేదెన్నడో అంటూ నిట్టూరుస్తోంది చెన్నై మీడియా. సుందర్ ట్రాక్ రికార్డు అలా ఉంది మరి.
Tags:    

Similar News