డీఎస్పీ మాట నిజమైతే బాగుండు

Update: 2021-12-15 07:30 GMT
జాతీయ అవార్డులు అనేవి తెలుగు సినిమాలకు అందని ద్రాక్ష అన్నట్లుగా అయ్యాయి. ప్రాంతీయ భాష సినిమాల విభాగంలో మరియు ఒకటి రెండు సాంకేతిక విభాగంలో తప్ప తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం చాలా అరుదు అయ్యింది. కలెక్షన్స్ పరంగా మన సినిమాలు బాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గడం లేదు.

కొన్ని సినిమాలు బాలీవుడ్‌ సినిమాలను మించి వసూళ్లు చేస్తున్నాయి. కాని అవార్డుల విషయానికి వచ్చేప్పటికి నిరాశ తప్పడం లేదు. జాతీయ స్థాయిలో ఉత్తమ హీరో లేదా హీరోయిన్‌ గా తెలుగు వారికి తెలుగు సినిమాలకు ఎప్పటికి రావా అంటూ అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు మీడియా వారు ఆవేదనతో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలుగు హీరోకు జాతీయ అవార్డు చర్చ మొదలు అయ్యింది.

పుష్ప సినిమా లో అల్లు అర్జున్‌ చేసిన పాత్ర అద్బుతంగా వచ్చింది అంటూ ఇప్పటికే అంతా అంటున్నారు. ఒక తెలుగు హీరో తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఇలాంటి డీ గ్లామర్ మాస్ పాత్ర చేయడం అనేది టాలీవుడ్‌ లో చూడం. మలయాళం మరియు తమిళంలో మాత్రమే చూస్తాం. ఈ సినిమా తో బన్నీ తన కెరీర్‌ బెస్ట్‌ ఇచ్చాడు అని ట్రైలర్ మరియు టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది. సినిమాలోని సన్నివేశాలు చూసిన వారు అయితే అల్లు అర్జున్‌ వరల్డ్‌ క్లాస్ యాక్టర్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా చెన్నై లో ఏర్పాటు చేసిన పుష్ప సినిమా తమిళ వర్షన్‌ ప్రెస్ మీట్‌ లో భాగంగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అల్లు అర్జున్‌ ఈ సినిమాలో నటించిన తీరు.. ఆయన పాత్ర మేకోవర్‌ అన్ని కూడా అద్బుతంగా ఉన్నాయన్నాడు. ఖచ్చితంగా పుష్ప పాత్రకు గాను జాతీయ అవార్డును బన్నీ తీసుకుంటాడనే నమ్మకంను దేవిశ్రీ ప్రసాద్‌ వ్యక్తం చేశాడు.

తెలుగు హీరోలు హీరోయిన్స్ కు జాతీయ అవార్డులు వస్తున్న దాఖలాలు లేకపోవడంతో అసలు తెలుగు ప్రేక్షకులు ఆ విధమైన ఆలోచనే మర్చి పోయారు. అవార్డుల విషయం మళ్లీ చర్చకు రావడంతో ఇప్పుడు బన్నీ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు దేవి శ్రీ ప్రసాద్‌ అన్నట్లుగా నిజంగా పుష్ప రాజ్ కు జాతీయ అవార్డు వస్తే బాగుండు అంటున్నారు.

పుష్ప సినిమా కోసం బన్నీ పడ్డ కష్టం.. నటించిన తీరు.. డైలాగ్‌ డెలవరీ ప్రతి ఒక్కదానికి కూడా ఆయన చూపించిన చొరవకు ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే. అది సాదా సీదా అవార్డు కాదు నేషనల్‌ అవార్డు అవ్వాలంటూ అభిమానులు మరియు పుష్ప కోసం వర్క్‌ చేసిన వారు కూడా అంటున్నారు. మరి జాతీయ అవార్డులు అంటే రాజకీయం అంటూ ఈమద్య విమర్శలు వస్తున్నాయి. అంతటి రాజకీయాలు ఉన్న జాతీయ అవార్డు మన ఐకానిక్ స్టార్ కు వచ్చేనా అనేది చూడాలి.

Tags:    

Similar News