ఏపీలో సినిమాలకు పన్ను మినహాయింపు విషయంలో వివాదాలు తప్పడం లేదు. టీడీపీ ప్రభుత్వానికి, పెద్దలకు కావాల్సినవారి సినిమాలకు మాత్రమే మినహాయింపు దొరుకుతోందన్నది ఆరోపణ. మూడేళ్ల కిందట గుణశేఖర్ తీసిన ‘రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పన్ను మినహాయింపు ఇవ్వడం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతడి విన్నపాన్ని తిరస్కరించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్ది రోజులకు టీడీపీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు వియ్యంకుడు అయిన హీరో బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. దీంతో గుణశేఖర్ అప్పట్లో అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తాజాగా మహానటి సినిమాకు అడక్కుండానే చంద్రబాబు పన్ను మినహాయింపు ప్రకటించడంతో గుణశేఖర్ సోషల్ మీడియాలో స్పందించారు. అయితే... ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా దండం పెడుతున్నట్లుగా ఉన్న ఒక ఎమోజీని వాడారు.
అశ్వినీదత్ నిర్మాణంలో వచ్చిన ‘మహానటి’కి పన్ను మినహాయింపు ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. అశ్వినీదత్ మినహాయింపు ఏమీ కోరనప్పటికీ చంద్రబాబు మాత్రం తన వైపు నుంచి ఈ ప్రకటన చేసేశారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. తమ సినిమాకు పన్ను మినహాయింపు వద్దని, చంద్రబాబు సర్కారు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న నేపథ్యంలో తామే రూ.50 లక్షలు విరాళం ఇవ్వదలుచుకున్నామని దత్ ప్రకటించారు.
ఇదంతా చూసిన గుణ శేఖర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ కేవలం దండం పెడుతున్న ఒక ఇమోజీ మాత్రం పెట్టారు. టీడీపీకి - చంద్రబాబుకు సన్నిహితుడైన అశ్వినిదత్ కు సీఎం అడక్కుండానే వరమివ్వడంపై ఇతర వర్గాల నుంచి కూడా విమర్శలొస్తున్నాయి. ఈ మినహాయింపులకు ప్రాతిపదికేంటన్న ప్రశ్న వినిపిస్తోంది.