సినిమా టికెట్ల కోసం విశాల్ యాప్

Update: 2017-08-19 08:02 GMT
తాను మాటల మనిషిని కాదని.. చేతల మనిషినని రుజువు చేస్తున్నాడు తెలుగువాడైన తమిళ హీరో విశాల్. నడిగర్ సంఘం కార్యదర్శి పదవి అందుకున్నాక సంఘంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు విశాల్. క్రికెట్ మ్యాచ్ నిర్వహించి తొమ్మిది కోట్ల రూపాయలు సమకూరేలా చేసిన విశాల్.. సంఘం భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. పేద కళాకారులకు భారీగా పెన్షన్ అందేలా చూశాడు. మరోవైపు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అక్కడ కూడా తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికే పైరసీకి వ్యతిరేకంగా గట్టి పోరాటం చేస్తున్న విశాల్.. నిర్మాతలకు లాభం చేకూర్చే నిర్ణయాలు చేపడుతున్నాడు. తాజాగా అతను ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు.

ప్రస్తుతం ఆన్ లైన్లో ఏ టికెట్ బుక్ చేసినా అదనంగా 20 రూపాయల దాకా ఛార్జీలు పడుతున్నాయి. తమిళనాట జీఎస్టీ కారణంగా అసలే టికెట్ల రేట్లు పెరగ్గా.. ఈ అదనపు బాదుడుకు జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక టికెట్ మీద పది రూపాయలు మాత్రమే అదనపు ఛార్జ్ పడేలా నిర్మాతల మండలి తరఫున ఒక ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నాడు విశాల్. ఈ పది రూపాయల ఛార్జ్ పెట్టడంలో కూడా ఒక మంచి ఆలోచన లేకపోలేదు. ఇందులో కొంత మేర యాప్ మెయింటైనెన్స్ ఖర్చులకు వినియోగిస్తారు. కొంతమేర నిర్మాతలకు వెళ్తుంది. ఇంకొంత రైతు సంక్షేమ నిధికి వెళ్తుంది. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మన దగ్గర కూడా ఇలాంటి యాప్ ఒకటి వస్తే బాగుంటుంది కదా?
Tags:    

Similar News