విశాల్​ పొలిటికల్​ ఎంట్రీ.. రసకందాయంలో తమిళ పాలిటిక్స్​..!

Update: 2020-12-14 02:30 GMT
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో తమిళనాడులో రాజకీయ వేడి రాజుకున్నది. రజనీ పొలిటికల్​ ఎంట్రీతో ఈ సారి మరింత హీట్​ పెరుగనున్నది. జనవరిలో రజనీకాంత్​ రాజకీయాల్లోకి రానున్నారు. ఆయన పెట్టబోయే పార్టీ సిద్ధాంతాలు, విధానాలు ఏమిటో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో ఆయన కొత్త పార్టీ ఉండబోతున్నట్టు సమాచారం. కమల్ హాసన్ ఇప్పటికే పార్టీ పెట్టి గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో పోటీ కూడా చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తమిళనాడులో మరోసినీహీరో విశాల్​ కూడా రాజకీయాల్లోకి రానున్నారట. అయితే విశాల్​ పొలిటికల్ పార్టీని స్థాపించడం లేదట. ఏదైనా నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్రంగా పోటీచేస్తారని సమాచారం. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.  ఈ విషయంపై ఆయన ఇప్పటికే అనుచరులతో చర్చలు జరుపుతున్నారట. విశాల్ గతంలోనూ నిర్మాతల సంఘం ఎన్నికలు, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేసి ఆ సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.  దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక రాగా విశాల్ పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు.

అయితే విశాల్ నామినేషన్ ప్రతిపాదించిన పదిమందిలో కొంతమంది తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఆ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. తమిళనాడులో ఇప్పటికే పలువురు సినీనటులు రాజకీయాల్లో ఉన్నారు. కమల్​హాసన్​ మక్కల్​ నీది మయ్యం అనే పార్టీని స్థాపించి గత లోక్​సభ ఎన్నికల్లో పోటీచేశారు. కానీ ఆయన పార్టీ ఆశించినస్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పార్టీ పోటీచేయనున్నది. మరోవైపు రజనీకాంత్​ కూడా పొలిటికల్​ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు విశాల్​ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సినీ నటులను, వారి పార్టీలను ప్రజలు ఆదరిస్తారు. లేదా అన్న విషయం త్వరలోనే తేలనున్నది.
Tags:    

Similar News