ఫోకస్‌ : సొంత కుంపటి పెట్టుకుంటున్నారు

Update: 2015-07-29 02:29 GMT
ఈరోజుల్లో హీరోలే నిర్మాతలు. ఎవరికి వారే సొంతంగా బ్యానర్లు పెట్టుకుని సినిమాలు తీసుకుంటున్నారు. అయితే ఇదేమీ ఇప్పుడే పుట్టిన విద్య కాదు. అలనాటి మేటి హీరోలంతా ఎవరికివారు సినిమా వ్యాపారం చేసినవాళ్లే. తమకి ఉన్న క్రేజును క్యాష్‌ చేసుకున్నవాళ్లే. అసలు ఇలా హీరోలే బ్యానర్లు పెట్టుకుని నిర్మాతలుగా మారే ప్రక్రియ ఎప్పట్నుంచి మొదలైంది? అన్నది ఆరాతీస్తే....

అక్కినేని నాగేశ్వరరావు 1955లోనే అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రారంభించి చిత్ర పరిశ్రమని మద్రాసు నుంచి హైదరాబాద్‌ రప్పించారు. అదే టైమ్‌ లో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ ని స్థాపించి స్వయంగా సినిమాలు నిర్మించడం మొదలెట్టారు. ఆ బ్యానర్‌ ను ఇప్పటికీ ఆయన వారసులు కొనసాగిస్తూ, సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. ఈ బ్యానర్‌ లో నాగార్జున విజయవంతమైన సినిమాలెన్నో నిర్మించారు. 1955లో దొంగరాముడు నుంచి మొన్నటి 2014 మనం వరకూ ఈ సంస్థలో సినిమాలు వచ్చాయి. అలాగే అప్పట్లోనే తమిళ హీరో శివాజీ గణేషన్‌ తన పేరుపైనే శివాజీ ప్రొడక్షన్స్‌ ప్రారంభించారు. ఈ సంస్థ తరపున పుదియ పరవై చిత్రంతో పంపిణీ రంగంలో అడుగుపెట్టారు. తర్వాత రాజా పరవై చిత్రంతో సొంతంగా సినిమాలు నిర్మించడం మొదలెట్టారు.

అదే తీరుగా టాలీవుడ్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి సొంతంగా అంజనా ప్రొడక్షన్స్‌ (నాగబాబు చూసుకునేవారు) ప్రారంభించి ఎన్నో సినిమాల్ని నిర్మించారు. రామ్‌చరణ్‌ ఇప్పుడు నిర్మాతగా మారి చిరు 150వ సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. తల్లి ఆశయం కోసం చరణ్‌ ఈ పని చేస్తున్నాడు. అలాగే నందమూరి హీరోల్లో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తన ఉనికిని చాటుకుంటూ, నిర్మాతగానూ పెద్ద అడుగులు వేస్తున్నారు. నిర్మాతగా పరాజయాలే ఎదురైనా మొక్కవోని ధీక్షతో గెలుపు బాట పడుతున్నారు ఇటీవలి కాలంలో . పటాస్‌ తో హిట్‌ కొట్టి ట్రాక్‌ లోకి వచ్చిన కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం రవితేజ హీరోగా కిక్‌2 తెరకెక్కిస్తున్నాడు. అలాగే మంచు కుటుంబ హీరోలు మోహన్‌బాబు, మనోజ్‌, నటి లక్ష్మి ప్రసన్న  అందరూ నిర్మాతలే. సొంత సినిమాలు నిర్మించుకుంటూ బండి నడిపిస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో హీరో నాని సైతం సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. మరో యవ హీరో నారా రోహిత్‌ వరుసగా చిన్న సినిమాల్ని సొంత బ్యానరు లో తెరకెక్కిస్తున్నాడు.

ఓ మారు తమిళ చిత్ర రంగం పరిశీలిస్తే అక్కడ రజనీకాంత్‌, సూర్య, కమల్‌ హాసన్‌, విశాల్‌, ఆర్య ఇలా హీరోలంతా సినీనిర్మాతలుగా కొనసాగుతున్నారు. రజనీకాంత్‌ ఆ రోజుల్లోనే సొంతంగా బ్యానర్‌ ప్రారంభించారు . ఇప్పుడు కుమార్తెలు స్వయంగా ఈ బ్యానర్‌ ని నడిపిస్తున్నారు. అలాగే కమల్‌ హాసన్‌ రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై సినిమాలు తీస్తున్నారు. విశ్వరూపం, విశ్వరూపం 2 చిత్రాల్ని ఈ బ్యానర్‌ లోనే రిలీజ్‌ చేస్తున్నారు. అలాగే హీరో సూర్య 2డి ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పేరుతో బ్యానర్‌ ప్రారంభించి చిన్న సినిమాలు తీస్తున్నాడు. అలాగే విశాల్‌ ఫిలింఫ్యాక్టరీ ప్రారంభించిన నల్లనయ్య విశాల్‌ సినిమాలు నిర్మిస్తున్నాడు. హీరో ధనుష్‌ సైతం సొంతంగా బ్యానర్‌ ప్రారంభించి 3, విఐపి 2 వంటి చిత్రాల్ని నిర్మించాడు. ఆర్య తన తమ్ముడు సత్యని హీరోని చేసేందుకు సినిమా నిర్మాణంలోకి ప్రవేశించాడు.

మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌ లాల్‌, పృథ్వీరాజ్‌ వంటి ప్రముఖులు సొంతంగా బ్యానర్‌ లు పెట్టి సినిమాలు నిర్మించారు. కన్నడంలోనూ శివరాజ్‌ కుమార్‌ ఫ్యామిలీ సొంత బ్యానర్‌ లో సినిమాలు నిర్మిస్తున్నారు
Tags:    

Similar News