క్లియర్ గా లెక్కలు బయటకు.. రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ కు నిర్మాతకు వచ్చేదెంత?

Update: 2022-11-28 04:17 GMT
ఒక సినిమా వంద కోట్ల కలెక్షన్ అంటే..బ్లాక్ బస్టర్ అని.. ఆ సినిమా తీసిన నిర్మాతకు పండుగే పండుగని చెబుతుంటారు. అలాంటిది ఒక భారీ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వేళలో ఏం జరుగుతుంది? నిర్మాతకు వచ్చే ఆదాయం ఎంత? కలెక్షన్ల మీద జరిగే ప్రచారం తర్వాత.. వాస్తవం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.

తాజాగా టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరున్న దిల్ రాజు.. ఈ లెక్కల్ని చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. కలెక్షన్లు.. అందునా నిర్మాతలకు వచ్చేది ఎంత? అన్న దానిపై పూర్తి స్పష్టత వచ్చేలా ఆయన మాటలు ఉన్నాయి. కలెక్షన్లు.. అందులో నిర్మాతకు వచ్చేదెంత? అన్న విషయానికి వచ్చినప్పుడు ఆయనేం చెప్పారంటే..

వెయ్యి కోట్ల రూపాయిల కలెక్షన్ అంటారే కానీ.. నిర్మాతకు వచ్చేది ఎంత? అన్న విషయం మీద ఎవరూ మాట్లాడరంటూ.. "నిజాలు మాట్లాడుకుంటే చాలా స్పష్టత వస్తుంది. ఒక పెద్ద సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే 18 శాతం జీఎస్టీ లెక్కన రూ.36 కోట్లు పోతాయి.

ఈ విషయాల మీద ఎవరూ మాట్లాడరు. థియేటరికల్ రెంటల్స్ పేరుతో 25 శాతం అంటే రూ.50 కోట్లు పోతాయి. అంటే.. రూ.200 కోట్లలో రూ.110 కోట్లే డిస్ట్రిబ్యూటర్ చేతికి వస్తాయి. ఒకవేళ నిర్మాత తన సినిమాను డిస్ట్రిబ్యూటర్ కు సినిమాను ఇస్తే మరో 20 శాతం పోతుంది. అంటే.. రూ.25 కోట్లు పోతాయి. చివరకు నిర్మాత చేతికి వచ్చేది రూ.85 కోట్లు మాత్రమే" అంటూ లెక్కలు విప్పి మరీ చెప్పుకొచ్చారు.

ఈ పన్నులతో పాటు.. లాభం వస్తే డిస్ట్రిబ్యూటర్ కు.. ప్రొడ్యూసర్ కు 35 శాతం ఆదాయపన్ను ఉంటుందని చెప్పారు దిల్ రాజు. "అందుకే ఈ రంగంలో దీర్ఘకాలం నిలదొక్కుకొని నిలవటం కష్టం. ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే జాగ్రత్తగా అనే అదే పని చేసుకుంటూ పోవాలి. నిర్మాతగా మారి ఇరవై ఏళ్లు అయ్యింది. నాతో పాటు రియల్ ఎస్టేట్ లోకి వెళ్లిన వారున్నారు. వారితో పోలిస్తే నేను నథింగ్" అంటూ తేల్చేశారు దిల్ రాజు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News