ట్రిపుల్ ఆర్ డిజిట‌ల్ ప్రింట్ లో ఆ సీన్స్ ని చేరుస్తారా?

Update: 2022-04-05 02:30 GMT
యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూసిన చిత్రం ట్రిపుల్ ఆర్ ఎట్ట‌కేల‌కు మార్చి 25న విడుద‌లైన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం యుఎస్ ప్రీమియ‌ర్ ల‌తో సంచ‌ల‌నాల‌కు శ్రీ‌కారం చుట్టింది. ప్రీమియ‌ర్ ల ప‌రంగా ఈ మూవీ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి చ‌ర్చ నీయాంశంగా మారింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ఈ మూవీపై ప్రారంభం నుంచి అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డ్డాయి.

ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. అంటే కాకుండా ఇందులో న‌టించిన రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌పై దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియుల‌తో పాటు విదేశీయులు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంత మంది విదేశీయులు ట్రిపుల్ ఆర్ సినిమాని ప్ర‌చారం చేస్తూ ప్ర‌చార క‌ర్త‌లుగా మారారు కూడా. ఇదిలా వుంటే ట్రిపుల్ ఆర్ విడుద‌లై సోమ‌వారానికి ప‌ది రోజులు కావ‌స్తోంది.

అయినా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఏప్రిల్ 14న 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్ లో వున్నాయి. అంత వ‌ర‌కు ట్రిపుల్ ఆర్ మేనియా కొనసాగుతూనే వుంటుంది. 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' రిలీజ్ త‌రువాత ట్రిపుల్ ఆర్ ఫీవ‌ర్ కొంత వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం వుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ మూవీ ర‌న్ టైమ్ 3 గంట‌లు. అయితే అంత‌కు మించిన ఫుటేజ్ ని నిడివి కార‌ణంగా ప‌క్క‌న పెట్టార‌ట‌.

అయితే ఈ ఫుటేజ్ లోని కీల‌క ఘ‌ట్టాల‌ని ఓటీటీ వెర్ష‌న్ కోసం యాడ్ చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. టైటిల్ లోని ఓ ఆర్ ని చూపిస్తూ స్టోరీ అంటూ అదిలాబాద్ అడ‌వుల్లో గ‌వ‌ర్న‌ర్ స్కాట్‌, అత‌ని భార్య గిరిజ‌న పాప‌ని వెంట బానిస‌గా తీసుకెళుతుంది. అక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

ఆ పాప‌ని తిరిగి తెచ్చే క్ర‌మంలో ఢిల్లీకి వెళ్లిన ఎన్టీఆర్ అక్క‌డ అనూహ్యంగా చ‌ర‌ణ్ ని క‌ల‌వ‌డం, అత‌నితో స్నేహం.. ఇలా చూపించారు. అయితే అంత‌కు ముందు స‌న్నివేశాల్లో అడ‌విలో వున్న సంద‌ర్భంలో పాప‌తో ఎన్టీఆర్ కు బాండింగ్ వుంటుంద‌ట‌. నిడివి ఎక్కువ కావ‌డంతో ఆ సీన్ ల‌ని తొల‌గించార‌ట‌.

అంతే కాకుండా అలియా భ‌ట్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌, ఓ పాట‌, ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని కూడా తొల‌గించార‌ట‌. వీటిని డిజిట‌ల్ వెర్ష‌న్ లో జోడించే అవ‌కాశం వుందని అంటున్నారు. డిజిట‌ల్ వెర్ష‌న్ కు నిడివి స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఈ కీల‌క ఘ‌ట్టాల‌ని అద‌నంగా చేర్చ‌డం గ్యారెంటీ అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే జ‌రిగితే థియేట‌ర్ వెర్ష‌న్ కు మించి డిజిట‌ల్ ఓటీటీ వెర్ష‌న్ రికార్డు సృష్టించ‌డం గ్యారెంటీ. థియేట‌ర్ల‌లో చూసిన వారు కూడా ఓటీటీలో ట్రిపుల్ ఆర్ ని చూడాల‌ని పోటీప‌డ‌తారు. దీంతో సినిమా ఓటీటీ వెర్ష‌న్ స‌రికొత్త రికార్డులు సృష్టించ‌డం గ్యారెంటీ అని చెబుతున్నారు.
Tags:    

Similar News