విజయ్ దేవరకొండ పవన్ రూట్లోనే వెళ్తున్నాడే

Update: 2019-07-23 06:32 GMT
మాములుగా  స్టార్ స్టేటస్ రావాలి అంటే ఏ హీరోకైనా మాస్ ప్రేక్షకుల అండదండలు తప్పనిసరి. వీరి కెరీర్లో వసూళ్లే ప్రామాణికంగా నిలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉండాల్సిందే. మసాలా అంశాలు ఉంటేనే ఆ వర్గం ఆదరణ దక్కే పరిస్థితిలో కేవలం ప్రేమ కథల ద్వారా టాప్ స్టార్ గా ఎదగవచ్చా అంటే అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక్కడ కొందరు ఫ్యాన్స్ కి అతిశయోక్తిగా అనిపించినా విజయ్ ప్రయాణానికి గతంలో పవన్ సినిమా జర్నీకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అదెలాగో చూద్దాం.

పవన్ పరిచయం అయ్యింది లవ్ స్టోరీతోనే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ప్రేమ కన్నా మసాలా ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో జస్ట్ పాస్ మార్కులతో బయట పడింది. ఆ తర్వాత రెండు మూడు ఓకే అనిపించుకున్నా తొలిప్రేమ సృష్టించిన చరిత్రతో పవన్ పేరు మారుమ్రోగిపోయింది. ఖుషితో ఇండస్ట్రీ రికార్డులు తలవంచాయి. ఈ రెండు స్వచ్ఛమైన ప్రేమ కథలే. ఇక అక్కడి నుంచి పవన్ వెనక్కు చూసే అవసరం ఎప్పుడూ రాలేదు

ఇప్పుడు విజయ్ దేవరకొండను చూస్తే కెరీర్ ప్రారంభంలో చేసిన నువ్విలా-ఎవడే సుబ్రహ్మణ్యంలు వ్యక్తిగతంగా తనకు హెల్ప్ అయ్యింది తక్కువే. కానీ అర్జున్ రెడ్డిలో తనను చూసాక యూత్ తమకు ఐకాన్ లా మార్చేసుకున్నారు. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు డియర్ కామ్రేడ్ మీద అంచనాలు మాములుగా లేవు. ఏ హీరో చేయనంత గొప్ప ప్రమోషన్ ని విజయ్ దేవరకొండ దీనికి చేస్తున్నాడంటే దీన్ని ఎంతగా ప్రేమించాడో కదా అనే టాక్ పాజిటివ్ గా పని చేస్తోంది.

ఇదీ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ రేంజ్ తో పాటు మార్కెట్ కూడా ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం. ఇదీ ప్రేమ కథనే. చూస్తుంటే పవన్ లాగే విజయ్ దేవరకొండ కూడా లవ్ స్టోరీస్ తో స్టార్ అయిపోయి ఆ తర్వాత గబ్బర్ సింగ్ లాంటి మాస్ జానర్ ఏదైనా ట్రై చేస్తాడేమో చూడాలి. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ లో రష్మిక మందన్న హీరొయిన్ గా నటించగా జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది.


Tags:    

Similar News