వందేళ్ల తర్వాత విడుదలయ్యే సినిమా

Update: 2016-09-19 22:30 GMT
ఏదైనా సినిమాను విడుదల చేయటానికి ఎంత టైం తీసుకుంటారు? ఏడాది.. లేదంటే రెండేళ్లు. మన జక్కన్న లాంటోళ్లు అయితే మూడేళ్లు కూడా అలవోకగా తీసేసుకుంటారు. అయితే.. కొన్ని హాలీవుడ్ సినిమాలైతే సినిమా తీసి విడుదల చేయటానికి ఐదారేళ్లు కూడా తీసుకోవటం కనిపిస్తుంది. కానీ.. ఇప్పుడు మేం చెప్పే సినిమా అలాంటి.. ఇలాంటిది కాదు. ఈ సినిమా రిలీజ్ ఏకంగా వందేళ్ల తర్వాతేనట.

హాలీవుడ్ దర్శకులు రాబర్ట్ రోడ్రిగే తెరకెక్కించిన ‘‘100 ఇయర్స్; ద మూవీ యు విల్ నెవర్ సీ’’ సినిమా ఏకంగా 2115లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 2115 నవంబరు 18న విడుదల అవుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రమైన సినిమాకు జాన్ మాల్కొవిచ్ కథను అందించటంతో పాటు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

లూయి 8 కాగ్నక్ అనే లిక్కర్ కంపెనీ నిర్మించిన ఈ  సినిమా షూటింగ్ లో సమయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా రీల్ ను బుల్లెట్ ఫ్రూప్ లాకర్ లో పెట్టి నవంబరు 18 - 2115నాడు అటోమేటిక్ గా ఓపెన్ అయ్యేలా ఒక సిస్టంను ఏర్పాటు చేశారట. ఈ సినిమా ప్రీమియర్ షోకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెయ్యి మంది ప్రముఖుల్ని ఆహ్వానిస్తారట. వందేళ్ల తర్వాత రిలీజ్ అయ్యే ఈ సినిమా ట్రైలర్ ను మాత్రం గత ఏడాదే విడుదల చేశారు. ఈ సినిమా ఉప శీర్షికకు తగ్గట్లే.. ఇప్పటికే పుట్టినోళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా చూడలేరేమో. కొంతమంది సెంచరీ తర్వాత కూడా బతికే అవకాశం ఉన్నా.. వారికి ఈ సినిమా చూడాలన్న ఇంట్రస్ట్ ఉంటుందా? అన్నది ఒక ప్రశ్న అయితే.. వందేళ్ల తర్వాత అప్పటి సినిమా ఎంతలా మారుతుందో? అలాంటప్పుడు వందేళ్ల క్రితం తీసిన ఈ సినిమా ఏం చేస్తుందన్నది ఊహాలకు మాత్రమే పరిమితం. ఏమైనా.. సినిమా రిలీజ్ డేట్ విన్నోళ్లంతా అవాక్కయ్యే పరిస్థితి.
Tags:    

Similar News