కళ్యాణ్ రామ్... అసలు కష్టం ముందుంది

Update: 2015-09-01 07:50 GMT
‘పటాస్ సినిమా మీద కళ్యాణ్ రామ్ పెట్టిన పెట్టుబడి రూ.8 కోట్లు ఆ సినిమా వసూళ్లు దాదాపు రూ.20 కోట్లకు చేరుకున్నాయి. ఇంకేం బాగానే మిగుల్చుకున్నాడుగా అనుకుంటాం. కానీ ఆ సినిమా ద్వారా కళ్యాణ్ పెద్దగా మిగుల్చుకున్నదేమీ లేదన్నది అతడి సన్నిహితులకే తెలుసు. ఎందుకంటే కళ్యాణ్ గత ఫెయిల్యూర్స్ వల్ల ‘పటాస్’కు పెద్దగా బిజినెస్ జరగని టైంలో దిల్ రాజు ఎంటరయ్యాడు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. పెట్టుబడి మీద ఓ రెండు మూడు కోట్లేమో ఎక్కువ పెట్టి హోల్ సేల్ గా సినిమాను తీసేసుకున్నాడు. రెండు రాష్ట్రాల్లోనూ సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. భారీగా లాభాలు మిగుల్చుకున్నాడు. ఐతే రాజు చేసిన సాయం పెద్దది కాబట్టి కళ్యాణ్ రామ్ పెద్దగా ఫీలై ఉండడనే భావించాలి.

పటాస్ సంగతి పక్కనబెట్టేసి ఇప్పుడు కిక్-2 విషయానికి వద్దాం. ఈ సినిమా మీద కళ్యాణ్ రామ్ రూ.40 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాడు. థియేట్రికల్ బిజినెస్ జరిగింది రూ.28 కోట్లకు. శాటిలైట్ ద్వారా ఇంకో రూ.7 కోట్లు వచ్చాయి. అంటే డెఫిషిట్ రూ.5 కోట్లు. సినిమా హిట్టయి ఉంటే ఈ ఐదు కూడా వెనక్కి వచ్చేవేమో. కానీ అలా జరగలేదు. కిక్-2 వసూళ్లు రూ.20 కోట్ల దగ్గర ఆగొచ్చని అంచనా. అంటే బయ్యర్లకు రూ.8 కోట్ల దాకా నష్టం. ఐతే కళ్యాణ్  కు వచ్చిన నష్టం ఐదు కోట్లే కదా.. సినిమాను అమ్మేసుకున్నాడు కాబట్టి అంతటితో సరిపెట్టుకోవచ్చు అనుకుంటే పొరబాటే. అతడి తర్వాతి సినిమా వచ్చినపుడు.. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని బయ్యర్లు అడ్డం తిరుగుతారు. బయ్యర్లు సిండికేట్ అవుతారు కాబట్టి.. కిక్-2 తీసుకున్న బయ్యర్లకే సినిమాను ఇవ్వాలి. అది కూడా ఈ నష్టాల్ని పూరించేలా తక్కువకు అమ్మాలి. ఈ లెక్కల ప్రకారం చూస్తే కళ్యాణ్ రామ్ కు తక్కువలో తక్కువ ఓ పది కోట్లయినా నష్టం తప్పదన్నమాటే.
Tags:    

Similar News