విజయ్ వెనక్కి.. కళ్యాణ్ రామ్ ముందుకు?

Update: 2018-05-08 05:25 GMT
మే 18వ తేదీకి టాలీవుడ్ బాక్సాఫీస్‌లో గట్టి పోటీ ఉంటుందని అనుకున్నారు. గోపీచంద్ 25వ సినిమా ‘పంతం’తో పాటు విజయ్ దేవరకొండ మూవీ ‘టాక్సీవాలా’ అదే రోజు రిలీజ్ కావాల్సింది. ఐతే గోపీచంద్ సినిమా కొంచెం ముందుగానే రేసు నుంచి తప్పుకోగా.. ఇప్పుడు ‘టాక్సీవాలా’ కూడా ఆ తేదీకి రావట్లేదని తేలిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యం వల్ల ఆ సమయానికి సినిమాను రెడీ చేయలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా అల్లు వారి టీం అంతా ‘నా పేరు సూర్య’ మీదే ఫోకస్ చేయడంతో విజయ్ సినిమాను పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. వాళ్లు అనుకున్న ప్రకారం పని కాకపోవడంతో హడావుడి ఎందుకుని చెప్పి సినిమాను జూన్ నెలకు వాయిదా వేయక తప్పలేదు. మే నెలలో మంచి డేట్ మిస్సవడం ప్రతికూల విషయమే. కానీ తప్పలేదు.

మరి వచ్చే శుక్రవారం ఖాళీ అయిపోయిన నేపథ్యంలో ఆ రోజు ఏ సినిమా వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. కుదిరితే ఈ తేదీకి నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘నా నువ్వే’ను రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయాలని అనుకున్నారు. ఐతే ఆ వీకెండ్లో ఇంకో రెండు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. అక్కినేని నాగార్జున మూవీ ‘ఆఫీసర్’తో పాటు రవితేజ సినిమా ‘నేల టిక్కెట్టు’ కూడా ఆ వీకెండ్లోనే వస్తాయి. వాటి నుంచి పోటీని తట్టుకోవడం కళ్యాణ్ రామ్ సినిమాకు కష్టమే. అందుకే ఖాళీ అయిన ఈ వారాంతాన్ని వాడేసుకుందామని చూస్తున్నారట. ఐతే ఈ వారాంతానికి సినిమాను రెడీ చేయడం వాళ్లకు కూడా కొంచెం ఇబ్బందే అయినా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందటే రిలీజైన ‘నా నువ్వే’ ఆడియోకు మంచి స్పందనే వస్తోంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ‘180’ జయేంద్ర దర్శకుడు.
Tags:    

Similar News