కిక్‌2.. 12 కోట్లు నష్టపోయిన జూ.ఎన్టీఆర్‌?

Update: 2015-09-15 04:41 GMT
ఒక్క కిక్ 2 బోలెడ‌న్ని పాఠాలు నేర్పించింది. క‌థ‌ - కాక‌ర‌కాయ లేని సినిమాకి పెట్టుబ‌డులు పెడితే ఫ‌లితం ఎంత దారుణంగా ఉంటుందో అంద‌రికీ ప్రాక్టిక‌ల్‌గా అర్థ‌మైంది. ముఖ్యంగా ఈ సినిమాతో నిర్మాత క‌ళ్యాణ్‌ రామ్‌ కి పూర్తి స్థాయిలో జ్ఞానోద‌యం అయ్యింద‌ని ఫిలింన‌గ‌ర్‌ లో ముచ్చ‌టించుకుంటున్నారు. కిక్ 2 ప‌రాజ‌యం ర‌వితేజ‌లోనూ అంతో ఇంతో మార్పు తెచ్చింద‌ని, క‌థ‌ల ఎంపిక‌లో ఇదో గుణ‌పాఠం అని ముచ్చ‌టించుకుంటున్నారు. కార‌ణం ఏదైనా ఈ సినిమా వ‌ల్ల ఓ స్టార్ హీరో సైతం చిక్కుల్లో ప‌డ్డాడ‌న్న‌ది తాజా వార్త‌.

కిక్‌2 ఆన్‌ సెట్స్ ఉన్న‌ప్పుడే ఈ సినిమాకి ఆర్థికంగా క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. పెట్టుబ‌డుల్ని కుమ్మ‌రించ‌డానికి క‌ళ్యాణ్‌ రామ్‌ కి ఫైనాన్స్ స‌పోర్ట్ అవ‌స‌ర‌మైంది. సినిమా షూటింగ్ పూర్త‌య్యి కూడా ఏప్రిల్‌ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆగ‌స్టు చివ‌రి నాటికి కానీ రిలీజ్ కాలేదంటే అందుకు కార‌ణం ఆర్థిక విష‌యాలే. అయితే అన్న క‌ళ్యాణ్‌ రామ్ ఆర్థిక అవ‌స‌రాల్లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ సాయం చేశాడు. అన్న‌కు హుఠాహుఠీన 6కోట్లు అప్పుగా ఇచ్చాడు.  ఆ డ‌బ్బు కూడా స‌రిపోక‌పోవ‌డంతో నిర్మాత దిల్‌ రాజు రంగంలోకి దిగి మ‌రో 6 కోట్లు స‌ర్ధాడు. అయితే ఆ 6 కోట్లు జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించే సినిమాకి అడ్వాన్స్‌. అంటే ఎన్టీఆర్ తన అన్న‌కు ఇచ్చింది 12 కోట్లు అన్న‌మాట‌.

కిక్ 2 రిలీజై డిజాస్ట‌ర్ అయ్యింది. స‌గం పెట్టుబ‌డులు కూడా తిరిగి రాలేదు. ఆ మేర‌కు ఎన్టీఆర్‌ కి 12 కోట్లు న‌ష్టం కిందే లెక్క‌. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఈ ఆర్థిక వ్య‌వ‌హారాల్ని సెట్ రైట్ చేసేందుకు లండ‌న్ నుంచి హైద‌రాబాద్‌ కి తిరిగొస్తున్నాడ‌ని చెబుతున్నారు. అంతేకాదు స‌కుమార్‌ తో సినిమా పూర్త‌య్యాక అత‌డు దిల్‌ రాజు తోనే సినిమా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్వాన్స్ తీసుకున్నాడు కాబ‌ట్టి. ఒక్క కిక్కు 100 పాఠాలు.. ఇప్పుడ‌ర్థ‌మైందా?
Tags:    

Similar News