#చిరు152: థీమ్ ఇదే అంటున్నారే!

Update: 2019-10-14 16:29 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో 100% సక్సెస్ రేట్ ఉన్న వ్యక్తి కొరటాల శివ.  డైరెక్టర్ గా సక్సెస్ కావడం వేరు.. ఒక స్టార్ హీరో తో సక్సెస్ సాధించడం వేరు.  చాలామంది ఈ విషయంలో పొరపాటు పడతారు.  ఒక స్టార్ హీరోతో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాను అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి సూపర్ హిట్ సాధించడం చాలా కష్టం. ఒక ఉదారాహణ తీసుకుంటే పా రంజిత్ ఒక టాలెంటెడ్ డైరెక్టర్.. అందులో అనుమానమే లేదు.  అయితే పా రంజిత్ 'కబాలి'.. 'కాలా'లు తీసినట్టు తీస్తే కొందరు మేథావులు మెచ్చుకోవచ్చు.. చేతులు నొప్పెట్టేలా నిద్రాహారాలు మాని చప్పట్లు కొట్టవచ్చు. కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమాలను లాటిన్ భాషలో చూసినట్టు ఉంటుంది.  

కానీ కొరటాల అలా స్టార్ హీరో ఇమేజ్ ని వేస్ట్ చేసే దర్శకుడు కాదు.  స్టార్ హీరోల ఇమేజికి తన సోషల్ మెసేజిని కలిపి ఒక బ్లాక్ బస్టర్ ను వండే మాస్టర్ చెఫ్. ఈసారి చిరు కోసం కూడా కొరటాల అలాంటి  కథనే తయారు చేశారట. #చిరు152 లో చిరంజీవి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో నటిస్తారని టాక్.  ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో జరిగే అవినీతి వల్ల.. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమాజనికి జరిగే హాని గురించి ఈ సినిమాలో చర్చిస్తారట.  ఇక దేవాదాయ శాఖ అంటే చాలామంది రాజకీయ నాయకులకు ఒక పార్కు.. రిసార్టు లాంటిది కదా. దేవాలయాల భూములను ఆక్రమిస్తారు.. గుడులనే కబ్జా చేస్తారు.  చిరు ఈ సినిమాలో సరిగ్గా అలాంటివారి భరతం పడతారట.  

ఇది నిజంగానే బర్నింగ్ ఇష్యూ కానీ ఎవరూ ఫిలింమేకర్లు ఇంతవరకూ టచ్ చేయలేదు. చిరు-కొరటాల సినిమా బేసిక్ థీమ్ ఇదేనని.. దీంతో పాటు ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది.  ఈ లెక్కన మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమాతో గూస్ బంప్స్ రావడం ఖాయమే.


Tags:    

Similar News