ఫేడవుటైన కమెడియన్ రైజ్ అయ్యాడు

Update: 2016-11-27 15:30 GMT
టాలీవుడ్లో కొందరు కమెడియన్లు అనూహ్యంగా రైజ్ అవుతుంటారు. స్టార్ ఇమేజ్ సంపాదిస్తారు. కొన్నేళ్ల పాటు హవా సాగిస్తారు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతారు. కృష్ణభగవాన్ కూడా ఆ కోవకే చెందుతాడు. ఒకప్పుడు విలన్ పాత్రలు చేసి.. ఆ తర్వాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో కమెడియన్ టర్న్ తీసుకున్న కృష్ణభగవాన్.. ఆ తర్వాత కొన్నేళ్లలో స్టార్ స్టేటస్ సంపాదించాడు. ఒక టైంలో ఏడాదికి 20-30 సినిమాలు చేశాడు కృష్ణభగవాన్. కొన్ని సినిమాలు ఆయన పాత్ర మీదే నడిచాయి. కానీ తర్వాత అనుకోకుండా డౌన్ అయ్యాడు. కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు బాగా దూరం అయిపోయాడు. ఈ మధ్య ‘అలా ఎలా’ లాంటి ఒకటీ అరా సినిమాల్లో మాత్రమే కనిపించాడు కృష్ణభగవాన్.

ఐతే తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో కృష్ణభగవాన్ మళ్లీ ఓ మంచి పాత్రతో ప్రేక్షకుల్ని నవ్వించాడు. తనదైన గోదావరి యాసతో.. సెటైరికల్ కామెడీ టైమింగ్ తో నవ్వించే కృష్ణభగవాన్ కు సరిగ్గా సూటయ్యే పాత్ర ఇచ్చాడు దర్శకుడు శివరాజ్ కనుమూరి. అతడి బాడీ లాంగ్వేజ్ తగ్గట్లుగా పాత్రను డిజైన్ చేశాడు. ఎదుటివాడు సుఖంగా ఉంటే చూడలేక మంట పెట్టే పాత్రలో కృష్ణభగవాన్ అదరగొట్టాడు. ఇక ఆ పాత్ర చుట్టూ తిరిగే ‘మంగళవారం’ కామెడీ అయితే పేలిపోయింది. అడల్ట్ టచ్ ఉన్నప్పటికీ ఆ కామెడీ కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తోంది. కొంచెం నెమ్మదిగా సాగే ఈ సినిమాలో ఈ కామెడీనే మంచి ఊపునిస్తుంది. మొత్తానికి కృష్ణభగవాన్ చాన్నాళ్ల తర్వాత తన ప్రత్యేకత చాటుకున్నాడు. తనలో సత్తా ఇంకా తగ్గలేదని రుజువు చేశాడు. ఈ ఊపులో ఆయనకు కొన్ని అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News