'శ్యామ్ సింగ రాయ్' స్టేజ్ పై అందాల జలపాతం!

Update: 2021-12-15 03:09 GMT
నాని హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్'  సినిమాను రూపొందించాడు. 'టాక్సీవాలా' సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన, కసరత్తు చేసి పట్టుకొచ్చిన కథనే ఇది. నిర్మాతగా వెంకట్ బోయనపల్లికి ఇది మొదటి సినిమా. నాని ఇంతవరకూ చాలా సినిమాలు చేసినప్పటికీ, కథను బట్టి తన లుక్ లో చిన్న చిన్న మార్పులను మాత్రమే చేస్తూ వచ్చాడు. ఈ సారి మాత్రం ఆయన తన లుక్ తో పాటు కాస్ట్యూమ్స్ విషయంలోను ప్రత్యేకతను కనబరచవలసి వచ్చింది. అందుకు కారణం ఈ సినిమా 70 దశకానికి చెందినది కావడమే.

70వ దశకంలో కలకత్తాలో ఆచారాల పేరుతో స్త్రీల పట్ల సాగిన అనాచారాల పట్ల నిరసన గళం వినిపించిన సంస్కర్తగా నాని ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఆవేశం .. ఆత్మవిశ్వాసం ..  ఆదర్శం ఈ మూడూ కలిసిన పాత్ర ఆయనది. అలాంటి ఈ పాత్రలో నానీని చూడటానికి అభిమానులంతా కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారు. కొన్ని పోస్టర్స్ లో ఆయన సాయిపల్లవి సరసన కనిపిస్తే, మరోచోట ఆయన జోడీగా కృతి శెట్టి అందాల మందారమై మెరుస్తోంది. ఇక మూడవ కథానాయిక అయిన మడోన్నా పాత్రను మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు.

ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, నిన్న రాత్రి వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరువుకుంది. వేలాది మంది అభిమానులు ఈ వేదిక దగ్గరికి తరలివచ్చారు. ఈ వేదికపై కృతి శెట్టి అందాల చందమామలా మెరిసింది. లాంగ్ ఫ్రాక్ తో అజంతా శిల్పం అలలపై తేలుతూ వస్తున్నట్టుగా ఆమె స్టేజ్ పైకి చేరుకుంటూ ఉంటేనే, అభిమానులు పెద్ద ఎత్తున తమ ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. 'ఉప్పెన' సినిమా నుంచి ఆమెను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న కుర్రాళ్లంతా చూపుల వాన కురిపించారు.

ఈ వేదికపై కృతి శెట్టి మాట్లాడుతూ .. " ఈ సినిమాలో అందరి పెర్ఫార్మెన్స్ .. విజువల్స్ .. ఎగ్జిక్యూషన్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి .. మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. సేఫ్ గా మాస్కులు పెట్టుకుని వచ్చి థియేటర్లోనే చూడండి. నాని గారు అంటే నాకు మాత్రమే కాదు, మా ఫ్యామిలీలో అందరికీ చాలా చాలా ఇష్టం. నా రెండవ సినిమానే ఆయనతో కలిసి చేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నిర్మాత వెంకట్ గారు చాలా స్వీట్ పర్సన్. రాహుల్ గారికి ఇది రెండవ సినిమా.. కానీ అలా అనిపించలేదు. ఆయన తన వర్క్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. ఈ క్రిస్మస్ మాత్రం 'శ్యామ్ సింగ రాయ్' దే అంటూ నాని మేనరిజమ్ ను అనుకరించింది. కాస్త బెరుకుగా .. కాస్త అమాయకంగా కనిపిస్తూ, ముద్దుముద్దుగా తెలుగులో మాట్లాడుతూ ఆమె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 
Tags:    

Similar News