మహానటి మూవీ ఓ సంచలనం. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభ.. వైజయంతి బ్యానర్ నిర్మాణ విలువలు.. సావిత్రిగా కీర్తి సురేష్ అసమాన నటన.. జెమిని పాత్రలో దుల్కర్ యాక్టింగ్.. సమంత- విజయ్ దేవరకొండ సపోర్టింగ్ రోల్స్.. అన్నీ కలిసి ఈ సినిమాను ఓ అధ్భుతంగా మార్చేశాయి.
అయితే.. డైరెక్షన్ - యాక్టింగ్-ప్రొడక్షన్-సినిమాటోగ్రఫీ-రచనలతో పాటు ఈ సినిమాకు ఆరో ప్రాణంగా నిలిచిన మరో పాయింట్ సంగీతం. స్వాతంత్ర్యం రాక పూర్వం నుంచి మొదలైన కథ.. దశాబ్దాలను దాటుకుంటూ 1980ల వరకూ నడుస్తుంది. ఆయా థీమ్ లకు అనుగుణంగా మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం.. మహానటికి ప్రాణం పోసింది. మ్యూజిక్ అద్భుతంగా ఉండండతోనే.. సినిమాలో మనం లీనమైపోయేందుకు ఆస్కారం చిక్కింది. కానీ.. ఇంత అద్భుతమైన సంగీతం ఇచ్చిన మిక్కీ జే మేయర్ గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు నాగ్ అశ్విన్.. హీరోయిన్ కీర్తి సురేష్ లకే వెళ్లిపోతోంది.
మహానటిలో కీర్తి సురేష్ అసమాన నటనను ప్రదర్శించిన మాట వాస్తవమే. సావిత్రిగా తను మారిపోయి మరీ యాక్టింగ్ చేసేసిన వైనం కారణంగా.. ఆమె గురించే ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అదే ఇతర టెక్నికల్ టీంను పట్టించుకోకుండా చేసేసింది. ఒక రకంగా చూస్తే మహానటి విజయం సాధించడంలో.. కీలక భూమిక పోషించిన మిక్కీకి.. తన కష్టానికి తగిన గుర్తింపు అయితే దక్కడం లేదు.