కుర్రాడేంటి ఇలా అంటున్నాడు

Update: 2018-02-01 18:30 GMT
చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా దర్శకుడు - రచయిత పనిలో వీలైనంత వరకు నటీనటులు జోక్యం చేసుకోకుండా ఉండటం ఉత్తమం అనే మాట తరచుగా వింటూనే ఉంటాం. టాలీవుడ్ లో ఆ మధ్య ఒక స్టార్ హీరో తన దర్శకుల పనిలో వేలు పెట్టడం వల్ల అవుట్ పుట్ తేడా కొట్టి సినిమా డిజాస్టర్ అయ్యింది అనే వార్త చాలా కాలం చక్కర్లు కొట్టింది. స్వేచ్చ లేకపోతే తాము అనుకున్నది తీయలేమని డైరెక్టర్లు కూడా పలుమార్లు చెబుతూ ఉంటారు. కాని ఛలో హీరో నాగ శౌర్య మాత్రం కొత్త వెర్షన్ వినిపిస్తున్నాడు. అఫ్ కోర్స్ కన్విన్సింగ్ గానే ఉంది లేండి. తాను చెబుతున్న ప్రకారం గతంలో కథా చర్చల్లో తాను కనీసం పాల్గొనేవాడిని కూడా కానని - కాని అలాంటివి ఫ్లాప్ అవుతూ ఉండటం  ఓవరాల్ గా తన మార్కెట్ ని దెబ్బ తీస్తోందని గుర్తించి ఇకపై వేలే కాదు కాలు కూడా పెట్టాలని గట్టిగా డిసైడ్ అయినట్టు చెప్పాడు.

పరాజయాల వల్ల తన మార్కెట్ ఒకేసారి నాలుగైదు మెట్లు కిందకు పడిపోతోంది అన్న నాగశౌర్య పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అయ్యేంత వరకు కథ - స్క్రీన్ ప్లే తో సహా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో తన ప్రమేయం ఉంటుందని కుండ బద్దలు కొట్టేసాడు. అది ఏ బ్యానర్ అయినా - ఎవరితో తీస్తున్నా ఫుల్ స్క్రిప్ట్ చేతిలో పడ్డాక దర్శకుడికి వదిలేస్తానని చెప్పాడు. ఛలో విషయంలో దర్శకుడు వెంకీ కుడుముల రెండు మూడు కథలు చెప్పిన తర్వాత అవి నచ్చక వద్దు అంటే నిజ జీవితంలో తాను ఎలా ఉంటానో బాగా ఆకళింపు చేసుకుని ఛలో కథ రాసుకుని వచ్చాడట.

నాగ శౌర్య చెప్పినదాంట్లో లాజిక్ కొంతవరకు ఉంది. ఈ మధ్య వస్తున్న డిజాస్టర్స్ చూస్తుంటే హీరోలు కనీసం కథైనా వింటున్నారా లేక దర్శకుడి పేరు చూడగానే ఒప్పేసుకుంటున్నారా అనే అనుమానం వస్తోంది. అలాంటప్పుడు స్టొరీ స్టేజిలోనే హీరో యాక్టివ్ గా ఉండటం మంచిదే. తాను చేయబోయే కథ మీద అది ఎంత వరకు వర్క్ అవుట్ అవ్వొచ్చు అనే దాని గురించి అవగాహన వస్తుంది. కాని అది పరిమితులకు లోబడి ఉంటేనే ఫలితం బాగుంటుంది.

Tags:    

Similar News