హీరో లేకుండా ఆడియో ఫంక్షన్

Update: 2018-02-24 13:29 GMT
మన హీరోలు ఎప్పుడెప్పుడు తమిళ్, మలయాళం మార్కెట్ లో పాగా వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మహేష్ బాబు అంతటివాడే స్పైడర్ సినిమా కోసం రిస్క్ చేసి మరీ రెండు బాషల షూటింగ్ లో పాల్గొని చాలా కష్టపడ్డాడు. అలాంటిది కోరి మరీ అక్కడ పరిచయం అయ్యే అవకాశం వచ్చినప్పుడు యూత్ హీరో ఎవరైనా సరే వదులుకుంటారా. ఛలో హీరో నాగ శౌర్య అదే పని చేసి కొత్త అనుమానాలు రేపాడు. తను, సాయి పల్లవి జంటగా నటించిన కరు అనే తమిళ్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీన్నే తెలుగులో కణం పేరుతో డబ్ చేసారు. డిసెంబర్ నుంచి పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఫైనల్ గా రంగం సిద్ధం చేసుకుంది.

చెన్నైలో జరిగిన ఆడియో వేడుకలో సాయి పల్లవి ఉంది కాని హీరో నాగ శౌర్య మాత్రం కనిపించలేదు. గతంలో తనకు సాయి పల్లవికి ఉన్న విభేదాల గురించి ఇంటర్వ్యూలో ఓపెన్ అయిపోయిన శౌర్య తన మీద కాస్త గట్టి చురకలే వేసాడు. దానికి తోడు థ్రిల్లర్ జానర్ లో రూపొందిన కణం సినిమాలో సాయి పల్లవి మరో పాపవే ప్రధాన పాత్రలు తప్ప నాగ శౌర్యది అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదని తెలిసింది. ఏదో అప్పుడు ఫ్లో లో ఒప్పేసుకున్న సినిమా కాబట్టి చేయాల్సి వచ్చిందే తప్ప అదే కణం కథ ఇప్పుడు వస్తే మటుకు శౌర్య ఖచ్చితంగా వద్దంటాడని అతని సన్నిహితులు అంటున్నారు. ఇదే మాట శౌర్య కూడా ఛలో సక్సెస్ అయ్యాక అన్నాడు.

కథతో సహా తన సినిమాల అన్ని విషయాల్లోనూ ఇకపై వేలు, కాలితో సహా అన్నింటిలోను దూరతాను అని శౌర్య చెప్పింది ఇందుకే కాబోలు. మరి కణం విషయంలో హీరో హీరొయిన్ కి అభిప్రాయ భేదాలు ఉన్నాయనే వార్తకు బలం చేకూరేలా శౌర్య డుమ్మా కొట్టడం చూస్తే తెలుగు వెర్షన్ ఆడియోకైనా వస్తాడా రాడా అనేది ఆసక్తికరంగా మారింది. సాయి పల్లవి మాత్రం వేడుకలో మంచి సందడి చేయటం విశేషం.
Tags:    

Similar News