బిగ్ బాస్ సీజన్ 2 పై నాని సెన్షేషనల్ కామెంట్స్

Update: 2018-04-10 10:25 GMT
వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న నాని ఈసారి కృష్ణార్జును లుగా డబుల్ యాక్షన్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ ఏప్రిల్ 12న ఈ చిత్ర విడుదల సందర్భంగా తుపాకీ రీడర్స్ కోసం నానితో స్పెషల్ చిట్ చాట్..

* ఇంట్లో ఉండే లేడీ ఆడియెన్స్ దగ్గర నుంచి కాలెజీ స్టూడెంట్స్ వరుకు అన్ని వర్గాల్లో నాని సినిమాలు బావుంటాయ్ అనే పేరు తెచ్చుకున్నారు - ఈ పేరు మీలో ఏమైనా మార్పు తీసుకొచ్చిందా?

- పేరు రావడం వల్ల నాలో ఏం మార్పు రాలేదు - బేసికల్ గా నేను ఎలా ఆలోచిస్తానో మీకో ఉదాహరణ చెబుతాను. బయట పార్కింగ్ లో నా B.M.W కార్ ఉంది. అది కొనడానికి వెళ్లినప్పుడు నాకు వచ్చిన మొదటి ఆలోచన ఏంటంటే - రేపు ఏదైనా సమస్యలు వచ్చి నేను ఈ కారు అమ్మేస్తే నాకు తిరగడానికి హోండా ఉందిగా అని అనుకున్నాను. ఇది అనే కాదు ఎవరైనా సినిమా బావుందని మెచ్చుకున్నా ఒకవేళ రేపు సినిమా ఫ్లాప్ అయితే ఇతను ఎలా రియాక్ట్ అయ్యేవాడో అని ఆలోచిస్తుంటాను. సినిమాల్లోకి వచ్చి నాకంటూ ఓ గ్తురింపు వచ్చాక - ముందు కీడెంచి తరువాత మేలెంచడం అలవాటైపోయింది. అలా ఉంటేనే ఇక్కడ ప్రశాంతంగా ఉండగలం అనిపిస్తోంది.

* వరుస విజయాలు మీ పై రోజు రోజుకి బాధ్యత పెంచుతున్నాయ్ అనుకోవచ్చా?

- నేను ఏదైనా సినిమా సైన్ చేసే ముందు కథ విని నాకు నచ్చితేనే ముందుకు వెళతాను - నేనే కాదు దాదాపు అందరూ అలానే చేస్తారు. అయితే నాకు నచ్చిన కథ జనాలకి నచ్చాలని లేదు. ఫైనల్ గా సినిమాకి తీర్పు ఇచ్చేది ప్రేక్షకులే. వారిని దృష్టిలో పెట్టుకునే నేను నటించే ప్రతి కథ పట్ల బాధ్యతగా ఉంటాను. ఇక్కడ నేను బాధ్యత ఉండటం అనేది కామన్ కానీ నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా స్టోరీ ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వకపోతే ఏం చేయలేము.

* చిత్తూరు యాస బాగా కుదిరినట్టుంది? యాస కరెక్ట్ గా రావడం కోసం ఏమైనా సాధన చేశారా?

- తెలుగు బాషకు నేను చాలా విలువ ఇస్తాను - మన బాష పై మనుకు పట్టు ఉండాలి. అదే ఎలాంటి యాస అనే సరే నేను డైలాగ్ చెబుతున్నప్పుడు పర్ ఫెక్ట్ గా ఉండాలనుకుంటాను. కృష్ణార్జున యుద్ధం డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమా కథ చెపినప్పుడు చిత్తూరు కుర్రాడిగా నటించాలన్నాడు. అప్పటి నుంచే మైండ్ లో ఫిక్స్ అయ్యాను కృష్ణ క్యారెక్టర్ డైలాగ్స్ చెబుతున్నప్పుడు యాస విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, దానికి తోడు గాంధీ కూడా చిత్తూరు జిల్లాకే చెందినవాడు కావడంతో షూటింగ్ సమయంలో గాంధీ టేక్ ఓకే చేసినప్పుడు నా యాస సరిగ్గానే ఉందని ఫీల్ అయ్యేవాడిని. మొదట రెండు రోజులు యాస విషయంలో కాస్త ఇబ్బంది పడ్డా కానీ తరువాత నుంచి అలవాటైపోయింది. బ్రేక్ టైమ్ లో కూడా అదే యాసలో మాట్లాడేవాడిని.

* బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారట నిజమేనా?

- బిగ్ బాస్ సీజన్ వన్ తారక్ హోస్ట్ గా చేయడం - ఆ షో పెద్ద హిట్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తరువాత సీజన్ కి నన్ను ఆ ఛానల్ వారు నన్ను ఎప్రోచ్ అయ్యారనే విషయం పై ప్రస్తుతానికి నేను ఎలాంటి కామెంట్స్ చేయలేను. నన్ను హోస్ట్ గా తీసుకోవడం పై పూర్తి నిర్ణయం ఛానల్ వారిదే. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి అప్ డేట్ లేదు. ఒక వేళ ఏదేనై ఉంటే అతి త్వరలోనే అధికారికంగా ఛానల్ వారు ప్రకటిస్తారు.

* మేర్లపాక గాంధీ మొదటి రెండు సినిమాలు వినోదాత్మకంగా సాగుతాయి - మరి కృష్ణార్జున యుద్ధం ఎలా ఉండబోతుంది?

- గాంధీ నుంచి గతంలో వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా - వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో ఫన్ బాగా వర్క్ అవుట్ అయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో కూడా గాంధీ ఆడియెన్స్ ని మెప్పించాడు. కృష్ణార్జున యుద్ధం కూడా చాలా వినోదాత్మకంగా సాగిపోతుంది. గాంధీ మార్క్ టైమింగ్ తో పాటు స్టోరీ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నిడివి ఉన్న మా చిత్రంలో ఫస్ట్ హాఫ్ గంటన్నర పైగా ఉంది. కానీ ఆ గంటన్నర ఎలా గడిపోయిందో ప్రేక్షకులకి తెలియనే తెలీదని అనుకుంటున్నాను. సినిమా మీద మా యూనిట్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.

* రీషూట్స్ జరిగాయనే టాక్స్ వచ్చాయి ఎంతవరుకు నిజం?

- ఆ మాటలు నూటికి నూరు శాతం అవాస్తవం - సినిమాలో ఉన్న ఒక్క ఫ్రేమ్ కూడా రీషూట్ చేయలేదు. గాంధీకి ముందు అవకాశం ఇచ్చింది రీషూట్స్ చేయడనే. ఒక్కసారి తన రాసుకున్న కథ లాక్ చేస్తే అదే షూట్ చేస్తాడు. మధ్యలో మార్పులు చేర్పులు జరగనే జరగవు.

* కథలో మీ ఇన్వాల్వ్ మెంట్ లేదంటారు ?

- మీరు కాంట్రవర్శీ కోసం ట్రై చేస్తున్నారా(నవ్వులు) ఇదిగో ఇవే రీషూట్స్ - కథలో వేలు పెట్టారా ఇవ్వన్ని కాంట్రవర్శీ ప్రశ్నలే కదా. అదేమీ లేదు - స్టోరీ డిస్కషన్స్ లో నాకు ఏదైనా నచ్చకపోతే అది నచ్చలేదనే బాధ్యత నా మీద ఉంది. అంతే కానీ దర్శకుడు స్వేఛ్ఛని హరించేంత క్రియేటివిటీ నాలో లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే నాకొచ్చిన విజయాలు వెనుక నా రైటర్స్ - డైరెక్టర్ కృషి ఎంతో ఉంది. వారి క్రెడిటి వారికి ఇవ్వడంలో నాకు ఎలాంటి మొహమాటం లేదు.

* అష్టాఛమ్మా నుంచి కృష్ణార్జునయుద్ధం వరుకు మీ పారితోషికంతో పాటు నటుడిగా కూడా మీరు ఎదుగుతూ వచ్చారు - ఈ రెండు అంశాల్లో మీకు ఏది సంతృప్తిని ఇచ్చింది?

- అష్టాఛమ్మాకి టీడిఎస్ లు కట్ చేసి 82 వేలు నాకు పారితోషికంగా ఇచ్చారు. నేను ఇప్పుడు కూడా అదే రెమ్యూనీరేషన్ తీసుకుంటే నా దగ్గరకొచ్చే నిర్మాతలంతా 82 వేలకి లక్కీ లాటరి టికెట్ తగిలందని భావించే అవకాశం ఉంది(నవ్వులు). అందుకే సినిమా సినిమాకి నా మార్కెట్ పెరిగే కొద్దీ రెమ్యూనరేషన్ కూడా పెరుగుతోంది. ఈ మనీ గేమ్ పై నేను పెద్దగా దృష్టి పెట్టను. ఫర్ సపోజ్ నా నెక్ట్స్ రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోతే అటోమెటిక్ గా నా పారితోషికం కూడా తగ్గిపోతుంది. అందుకే నా దృష్టి ఎప్పుడూ నటన పైనే ఉంటుంది. పిల్లజమీందార్ లో నా నటన కంటే కృష్ణార్జున యుద్ధంలో నా నటనలో ఎంత మార్పు వచ్చిందో చూసుకుంటాను కానీ సినిమా సినిమాకి నా పారితోషికం పెరుగుతుందా లేదా అని అంతగా ఆలోచించను. చివరిగా నాకు నటుడిగా ఎదగడమే సంతృప్తి.

* మరి నిర్మాతగా మీరు సంతృప్తిగానే ఉన్నారా?

- అ లాంటి ఓ డిఫరెంట్ మూవీని ఇంతగా తెలుగు ప్రేక్షకులు ఆదిరిస్తారని అస్సలు అనుకోలేదు. సినిమా తీసేటప్పుడే ఓ సెక్షన్ ఆఫ్ అడియెన్స్ ని టార్గెట్ చేశాము. వారికి అ బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ విషయంలో నేను నిర్మాతగా చాలా సంతృప్తిగా ఉన్నాను. కానీ హీరోగా సినిమా ముందు నేను ఎలాంటి టెన్షన్ పడతానో - నిర్మాతగా కూడా అ రిలీజ్ కి ముందు అలాంటి భయంలోనే గడపాల్సి వచ్చింది. దానికి తోడు అ వల్ల గ్యాప్ లేకుండా నా సినిమాలు ప్రేక్షకులు ముందుకి వస్తున్నాయనే భావన కలుగుతోంది.

* కృష్ణ -  అర్జుణ్ ఈ రెండు క్యారెక్టర్స్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది?

- కృష్ణ క్యారెక్టర్ నాకే కాదు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే మనందరిలో ఓ కృష్ణగాడు ఉంటాడు - కానీ అర్జుణ్ లాంటి ర్యాక్ స్టార్స్ అరుదుగా ఉంటారు. ఆ రాక్ స్టార్స్ మనలాంటి వారికి అయితే బాత్ రూమ్స్ లో తప్ప మాములు సమయంలో బయటకి రారు(నవ్వులు) అందుకే కృష్ణగాడు ఈసారి గట్టిగా కొడతానిపిస్తోంది.

* కృష్ణార్జున యుద్ధం కథ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందంటారా?

- మా కథ వుమెన్ ట్రాఫికింగ్ ఆధారంగా ఉందనే రూమర్స్ వస్తున్నాయి. ఈ అంశం కథలో ఓ కీలక భాగమే కానీ సినిమా మొత్తం ఆ పాయింట్ బేస్ చేసుకొని ఉండదు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే రీతిలోనే ఈ సినిమాను గాంధీ తీర్చిదిద్దాడు.

* ఒకసారి చేసిన డైరెక్టర్స్ తో మళ్లీ సినిమాలు చేయకపోవడానికి కారణం?

- నాకు హిట్ ఇచ్చిన దర్శకులంతా నాతో మళ్లీ సినిమా చేయలేనంతగా బిజీ అయిపోతున్నారు. అందుకు ఆనందపడాలో బాధపడాలో అర్ధం కావడం లేదు. మారుతి గారు దగ్గర నుంచి నిన్న మొన్ననే ఇండస్ట్రీకి వచ్చిన శివ వరుకు అందరూ బిజీగానే ఉన్నారు. ఈలోపు కొత్త దర్శకులు నా దగ్గరకు కొత్త పాయింట్స్ తో వస్తుంటే వారితో సినిమాలు చేయాల్సి వస్తోంది. ఇదో సర్కిల్ మాదిరి నిరంతరం తిరుగుతూనే ఉంది.

* అనుపమతో మీ కెమెస్ట్రీ బావుందంటున్నారు - ఆమెతో జర్నీ ఎలా సాగింది?

- అనుకి నాతో కెమెస్ట్రీ కాదు కెమెరాతో కెమెస్ట్రీ సరిగ్గా కుదిరింది. అను యాక్టింగ్ మాములుగా చూస్తే ఓ మాదిరిగా నటిస్తోంది అనుకుంటాం. కానీ మానిటర్ లో చూస్తే మాత్రం భలే నటిస్తోందనే ఫీలింగ్ వస్తోంది. నిజంగా అదో వరం. ప్రతి యాక్టర్ కి కచ్ఛితంగా ఉండాల్సిన క్వాలిటీ అది. అను విషయంలో ఈ క్వాలిటీ చాలా ఉంది. అందుకే చాలా షార్ట్ టైమ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మరో హీరోయిన్ రుక్సార్ మీర్ కూడా బాగా నటించింది. తెలుగు నేర్చుకోవాలనే తపన రుక్సార్ లో నాకు కనిపించింది. అది అభినందించాల్సిన విషయం.

* చివరిగా కృష్ణార్జున యుద్ధం కోసం ప్రేక్షకులకి ఏం చెబుతారు?

- ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం విడుదల అవుతోంది. కచ్ఛితంగా ప్రేక్షకుల్ని మెప్పించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. హిప్ హోప్ తమిజా మ్యూజిక్ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లాయి. దీంతో పాటు గాంధీ మార్క్ స్క్రీన్ ప్లే - కామెడీ టైమింగ్ మరోసారి ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాయని భావిస్తున్నాను. వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్.
Tags:    

Similar News