కమల్ చెప్పేశాడు.. ఇంకో రెండే అని

Update: 2018-02-14 07:32 GMT
మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’తో దాదాపుగా సినిమాలకు టాటా చెప్పేశాడు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెడుతూ ఇక తనకు సినిమాలు చేసే ఉద్దేశాలేమీ లేవని స్పష్టం చేశాడు. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుని ఇంకో సినిమా చేసి వెళ్తాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిపై స్పష్టత లేదు. 2019 ఎన్నికల తర్వాత పవన్ పయనం ఎలా ఉంటుందనే విషయంలో కూడా సందిగ్ధత కొనసాగుతోంది. ఐతే ఇదే సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తమిళ సీనియర్ నటుడు కమల్ హాసన్ మాత్రం తన సినీ కెరీర్ పై పూర్తి స్పష్టత ఇచ్చేశాడు. తాను ఇంకో రెండు సినిమాలు చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడతానని.. తర్వాత సినిమాలు చేయనని చెప్పేశాడు.

ఇటీవలే హార్వర్డ్ యూనివర్శిటీని సందర్శించి అక్కడ ప్రసంగం చేసిన కమల్.. ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మాట్లాడుతూ.. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలున్నాయని.. అవి పూర్తయ్యాక ఇక సినిమాలు చేయనని కమల్ తెలిపాడు. తాను కేవలం నటుడిగానే మరణించాలని కోరుకోవట్లేదని.. ప్రజలకు తన వంతుగా కొంత సేవ చేసి జీవితాన్ని ముగించాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని.. అంతే తప్ప తన బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడానికి కాదని అన్నాడు కమల్. రాజకీయాల్లో విజయవంతమైనా.. కాకపోయినా ఆ రంగంలోనే కొనసాగే శక్తి తనకుందని భావిస్తున్నట్లు కమల్ చెప్పాడు. ఐతే తాను రాజకీయాల్లో విఫలమవుతానని అనుకోవట్లేదని కమల్ ధీమా వ్యక్తం చేశాడు. మరి కమల్ చెబుతున్న ఆ రెండు ప్రాజెక్టులు ‘విశ్వరూపం-2’.. ‘ఇండియన్-2’లేనా?

Tags:    

Similar News