ఫెడవుట్ స్టార్స్ ను మళ్లీ తీసుకు వస్తున్న ఓటీటీ

Update: 2022-07-29 23:30 GMT
సినిమా స్టార్స్ కు ఒకప్పుడు కేవలం సినిమాలు మాత్రమే జీవనాధారం. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. సినిమా లు కాకుండా సోషల్‌ మీడియా మొదలుకుని ఓటీటీ వరకు  ఎన్నో మార్గాల్లో సెలబ్రెటీలు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో కనిపించకుండా పోయిన స్టార్స్ కూడా ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియా లో హడావుడి చేస్తున్న విషయం తెల్సిందే.

హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి కనిపించకుండా పోయిన లయ ఈ మధ్య మళ్లీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువ అయిన విషయం తెల్సిందే. అలా ఎంతో మంది సీనియర్‌ హీరోయిన్స్ మరియు హీరోలు సోషల్‌ మీడియా ద్వారా జనాల్లో ఉంటున్నారు. ఫేడ్ ఔట్‌ అయిన వారు ఏదో ఒక విధంగా సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తున్నారు.

ఇక నటీ నటులకు ఓటీటీ అనేది వరంగా మారింది. సినిమాల్లో ఆఫర్లు రాని వారు.. సినిమా ల నుండి ఫెడవుట్ అయిన వారికి ఓటీటీ లు పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది పాత స్టార్స్.. కనుమరుగయిన స్టార్స్‌ ఓటీటీ లో కనిపించారు.. ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. కొత్త వారికి మాత్రమే కాకుండా పాత వారికి కూడా ఓటీటీ లు అవకాశాలు కల్పిస్తున్నాయి.

అక్కినేని హీరో సుశాంత్‌ వరుస సినిమా లు నిరాశ పర్చడంతో తాజాగా ఓటీటీ ద్వారా వచ్చాడు. ఇప్పుడు అదే దారిలో జనాలు మర్చిపోయిన ఒక హీరో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయనే ఆర్యన్ రాజేష్‌. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడు... అల్లరి నరేష్‌ కు అన్న అయిన ఆర్యన్ రాజేష్ నటుడిగా రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు.

సినిమాల ద్వారానే ఈయన రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాని ఈయన రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న వినయ విధేయ రామ సినిమా ఫలితం బాక్సాఫీస్ వద్ద ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఆర్యన్‌ రాజేష్‌ ఇమేజ్ ను మరింతగా డ్యామేజీ చేసినట్లు అయ్యింది. అందుకే మళ్లీ గ్యాప్‌ ఇచ్చి సెకండ్‌ రీ ఎంట్రీ కి ఓటీటీ ని ఎంపిక చేసుకున్నాడు.

జీ5 తో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న 'హలో వరల్డ్‌' అనే వెబ్‌ సిరీస్ లో ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్‌ సిరీస్ ను చాలా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో పలువురు నటీ నటులు కనిపించబోతున్నారు. అందరూ సినిమాల్లో ప్రయత్నాలు చేసి విఫలం అయిన వారే.

జయం హీరోయిన్ సదా కూడా హలో వరల్డ్‌ అంటూ పలకరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తోంది. ఫేడవుట్‌ స్టార్స్ ఇంకా ఎంతో మంది ఏదో ఒక మార్గం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఓటీటీ లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News