కాటమరాయుడా.. అతి సర్వత్ర వర్జయేత్!

Update: 2017-03-14 11:02 GMT
స్టార్ హీరోల సినిమాలకు ప్రత్యేకంగా ప్రచారం అవసరం లేదు. సోషల్ మీడియా.. వెబ్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయిన నేపథ్యంలో సినిమా మొదలవ్వకముందే కావాల్సినంత క్రేజ్ వచ్చేస్తోంది. అలాగని పబ్లిసిటీ గురించి అస్సలు పట్టించుకోకుండా వదిలేయడమూ కరెక్ట్ కాదు. అలా అనుకుంటే అమీర్ ఖాన్ లాంటి బడా స్టార్ ఎందుకు తన సినిమాల్ని అంతగా ప్రమోట్ చేసుకుంటాడు. ఇది గమనించే మన స్టార్ హీరోలు కూడా గత కొన్నేళ్లుగా ప్రమోషన్ మీద బాగా దృష్టిపెడుతున్నారు. పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంతకుముందు తన సినిమాల విడుదలకు ముందు అస్సలు మీడియాను కలవని పవన్ కళ్యాణ్ కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ టైంలో మీడియాను కలిసి ఇంటర్వ్యూలివ్వడం.. తన సినిమా ప్రమోషన్ కూడా కొంచెం గట్టిగా చేయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఐతే ‘సర్దార్..’తో పోలిస్తే.. పవన్ లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’కు ప్రచారం మరీ హెచ్చు స్థాయిలో జరుగుతోంది. విడుదలకు ముందు పవన్ ఇంటర్వ్యూలవీ ఇస్తాడో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం పబ్లిసిటీతో మోతక్కించేస్తున్నారు. రెండు మూడు వారాల నుంచి ‘కాటమరాయుడు’కు సంబంధించి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విశేషం బయటికి వస్తోంది. ఒక పోస్టరో.. ఒక పాటో.. ఒక మేకింగ్ వీడియోనో.. ఇలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో లాంచ్ చేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా హోర్డింగులు.. ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. బస్సుల మీద కూడా ‘కాటమరాయుడు’ పోస్టర్ల సందడి కనిపిస్తోంది. ఐతే పవన్ సినిమా అంటే మామూలుగానే హైప్ ఎక్కువుంటుంది. పదేళ్ల పాటు సరైన హిట్టు లేని టైంలో కూడా పవన్ ప్రతి సినిమాకూ హైప్ వచ్చింది. ‘కాటమరాయుడు’ టీజర్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాపైనా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రచారం మరీ ఎక్కువ స్థాయిలో చేస్తే అసలుకే మోసం వస్తుందేమో అన్న కంగారు కూడా లేకపోలేదు. ‘కాటమరాయుడు’ తమిళ హిట్ ‘వీరం’కు రీమేక్. ఒరిజినల్ అంత గొప్ప సినిమా ఏమీ కాదు. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనరే. కాబట్టి సినిమా మీద అంచనాలు మరీ పెంచేయడం అంత మంచిది కాదు. ఇది ఓపెనింగ్స్ కు పనికొస్తుందేమో కానీ.. సినిమా అంచనాల్ని అందుకోలేకపోతే.. వీకెండ్ తర్వాత దెబ్బ పడుతుంది. కాబట్టి పబ్లిసిటీ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం మేలేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News