కామెంట్‌: నలుగురు రైటర్లు మారారు

Update: 2015-07-08 13:30 GMT
పవన్‌ కల్యాణ్‌ ఆలోచనల్లో స్థాయి పెరిగింది. త్రివిక్రమ్‌ కలయికతోనే అతడిలో ఈ అనూహ్య మార్పు. ప్రతిదీ పక్కాగా లేనిదే ముందుకు వెళ్లకూడదు అన్న పరిణతి స్పష్టంగా కనిపిస్తోంది ఇటీవలి కాలంలో. జనసేన మీటింగుల నుంచి సినిమాల ఎంపిక వరకూ ప్రతిదీ బాగా ఆలోచించి కానీ ముందడుగు వేయడం లేదు. అయితే ఇదంతా కాలంతో పాటే వచ్చిన పరిణతి.

అన్నయ్య 150వ సినిమాకే కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇప్పుడు తన సినిమా విషయంలోనూ అంతే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. రెండేళ్లుగా గబ్బర్‌సింగ్‌-2 వాయిదాల పర్వం కొనసాగించిందంటే దాని వెనుక ఎంతో మదనం ఉంది. కథ, కథనం, మాటలు.. ఈ మూడు విషయాల్లో క్షమించే ప్రసక్తే లేదని మొండి పట్టు పడుతున్నాడు పవన్‌. ఇవి సరిగ్గా ఉంటే తనకి ఎదురేలేదని భావిస్తున్నాడు. అందుకే ఇప్పటికే ముగ్గురు రైటర్లను మార్చాడు. నాలుగో రైటర్‌కి అవకాశం ఇచ్చాడు.

గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌ విషయంలో మైన్యూట్‌ నెగెటివ్స్‌ కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆరంభమే సంపత్‌ నంది ఈ చిత్రానికి పనిచేశాడు. అతడు రచయిత కం డైరెక్టర్‌. కానీ ఆ తర్వాత సీన్‌లోకి 'దొంగలబండి' ఫేం వేగేశ్న సతీష్‌ వచ్చాడు. అతడు పవన్‌తో కలిసి స్క్రిప్టును, డైలాగుల్ని చర్చించి మెరుగుదల కోసం ప్రయత్నించాడు. ఆ తర్వాత అనూహ్యంగా కొత్త దర్శరచయిత బాబి రంగంలోకి దిగాడు. సంపత్‌ నంది ఎగ్జిట్‌, బాబి ఆరంగేట్రం ఒకేసారి జరిగాయి. బాబి కూడా మహారచయితల దగ్గర పనిచేసి వచ్చిన మరో రచయిత కాబట్టి అతడు స్క్రిప్టుని మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. ఇటీవలే సినిమా మొదలైంది. అయినా ఇంకా పవన్‌లో ఏదో అసంతృప్తి. అందుకే గోపాల గోపాల చిత్రంతో ట్యాలెంటెడ్‌ రైటర్‌గా పేరు తెచ్చుకున్న సాయిమాధవ్‌ బుర్రాని వ్యక్తిగతంగా బెంగళూరు పిలిపించుకుని ఆన్‌సెట్స్‌ తన వెంటే తిప్పుకుంటున్నాడు పవన్‌.

సెట్‌లో అవసరం మేర డైలాగుల్లో మార్పు చేర్పులు చేయించుకుంటున్నాడు. స్పాంటేనియస్‌గా కొన్నిటిని డెవలప్‌ చేస్తున్నాడు. ఇప్పటికి నాలుగో రైటర్‌ సెట్టయినట్టే. పదే పదే డైలాగుల్లో మార్పు చేర్పులు చేస్తూ 100శాతం పక్కాగా ఉంటున్నాడట పవన్‌. సాయిమాధవ్‌ సంతృప్తి పరిచినట్టే ఉన్నాడు.

Tags:    

Similar News