లైంగిక వేధింపులపై రాష్ట్రపతికి పాయల్ లేఖ...!

Update: 2020-10-12 14:30 GMT
బాలీవుడ్‌ ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఇటీవల హీరోయిన్ పాయల్‌ ఘోష్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో అనురాగ్‌ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దర్శకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికే ఆయన్ని విచారించారు. తనపై నటి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలన్నీ అవాస్తవాలని.. నటి వేధింపులు జరిగాయని ఆరోపించిన సమయంలో తాను అసలు ఇండియాలో లేనని అనురాగ్‌ కశ్యప్‌ ఆధారాలు చూపించారని తెలుస్తోంది. అయితే నిందితుడు ప్రముఖ వ్యక్తి కావడంతో తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని.. తన కేసు విషయంలో ఇప్పటి వరకు పురోగతి లేదని తెలుపుతూ భారత రాష్ట్రపతికి పాయల్ ఘోష్ ఓ లేఖ రాసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థిస్తూ రాసిన ఆ లేఖను ఆమె ట్విట్టర్ లో షేర్ చేసింది.

'గతంలో నాపై జరిగిన లైంగిక దాడి గురించి ముంబై వెర్సోవా పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాను. నాకు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తానని చెప్పి తన ఇంటికి పిలిపించుకుని నిందితుడు నన్ను లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీనిపై నేను 22-9-2020 తేదీన పోలీస్ స్టేషన్‌ లో కంప్లైంట్ చేశాను. అయితే ఇప్పటివరకు ఈ కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. నిందితుడు ప్రముఖ వ్యక్తి కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం లేదు. ఇదే నేరం ఎవరైనా పేద వ్యక్తి చేసి ఉంటే ఈ పోలీసులు అదే రోజు అరెస్ట్ చేసి విచారించేవారు. కానీ నా కేసులో నిందితుడు ప్రముఖుడు. అందుకే స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. బాధితురాలినైన నేను న్యాయం కోసం రెండు చేతులు జోడించి అందరి తలుపులూ తడుతున్నాను. ఈ కేసులో జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను'' అని పాయల్ ఘోష్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పాయల్ ఇదివరకే కేంద్రమంతి రామ్‌ దాస్ అథవాలే - మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారి - కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లను కలిసి తనకు న్యాయం చేయాలని కోరిన సంగతి తెలిసిందే.
Full ViewFull View
Tags:    

Similar News