వర్మకు మళ్లీ పోలీస్ పంచ్?

Update: 2018-04-04 06:19 GMT
‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అంటూ ‘జీఎస్టీ’కి కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు రామ్ గోపాల్ వర్మ. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఆయన తీసిన ఈ సినిమాతో కావాల్సినంత ప్రచారం లభించింది. కమర్షియల్‌ గా కూడా ఇది బాగానే వర్కవుట్ అయినట్లుంది. దీనిపై టీవీ ఛానెళ్లలో కూర్చుని చర్చల్లో పాల్గొన్న వర్మ మహిళలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. వర్మ మీద సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లడం.. వాళ్లు అసలు ఈ సినిమా వ్యవహారమేంటో చూద్దామని.. తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇండియాలో పోర్న్ సినిమా తీయడంపై నిషేధం ఉండటంతో వర్మ చిక్కుల్లో పడ్డాడు.

పోలీసు విచారణ సందర్భంగా ‘జీఎస్టీ’ని పోలెండ్ లో తీశారని.. తాను స్కైప్ ద్వారా సూచనలు మాత్రమే చేశానని వర్మ చెప్పుకున్నట్లుగా వెల్లడైంది. విచారణ సందర్భంగా వర్మ ల్యాప్ టాప్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తర్వాత ఏ అప్ డేట్ లేదు. తాజా సమాచారం ప్రకారం వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారట. వర్మకు వ్యతిరేకంగా పోలీసులకు బలమైన ఆధారాలు లభించినట్లు సమాచారం. తమ పేర్లు బయటపెట్టడానికి ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులు వర్మ హైదరాబాద్ లోనే ‘జీఎస్టీ’ చిత్రీకరణ జరిపినట్లు ఆధారాలు సమర్పించారట. మరోవైపు తన కథనే కాపీ కొట్టి వర్మ ‘జీఎస్టీ’ తీసినట్లు జై కుమార్ అనే కుర్రాడు చేసిన ఫిర్యాదు నేపథ్యంలోనూ పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వర్మ మళ్లీ పోలీసు విచారణకు వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది.
Tags:    

Similar News