పోసాని రేవంత్‌ పై ప‌డ్డాడేంటి?

Update: 2020-06-07 15:33 GMT
ర‌చ‌యిత‌ - న‌టుడు.. పార్ట్ టైం పొలిటీషియ‌న్ కూడా అయిన ఫైర్ బ్రాండ్‌ పోసాని కృష్ణ‌ముర‌ళి చాన్నాళ్ల త‌ర్వాత మీడియా ముందుకొచ్చారు. ఎప్పుడూ ఏపీ రాజ‌కీయాల గురించే మాట్లాడే ఆయ‌న ఈసారి.. వాటితో పాటు  తెలంగాణ రాజ‌కీయాల మీదా మాట్లాడారు. ఆశ్చ‌ర్యక‌రంగా ఆయ‌న ఇక్క‌డి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ మీద‌.. ముఖ్యంగా ఆ పార్టీ అగ్ర నేత రేవంత్ రెడ్డి మీద విరుచుకుప‌డ్డారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ మీద రేవంత్ అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఆయ‌న ఆక్షేపించారు. రేవంత్‌కు అవినీతి మీద మాట్లాడే అర్హ‌త లేద‌ని పోసాని అన్నారు. రూ.50లక్షలు లంచం ఇస్తూ కళ్లముందు కనపడ్డ వ్యక్తి రేవంత్ అని - జైలుకు కూడా వెళ్లొచ్చాడ‌ని.. అలాంటి వ్యక్తి కేటీఆర్‌ను అవినీతి పరుడు అనడం బాధాకరమని పోసాని అన్నారు.

మంచి నాయకులపై బురద జల్లడం సరికాదన్న పోసాని.. ఎవరు మంచివాళ్లో తనకు తెలుసన్నారు. కేటీఆర్ - హరీశ్ రావు నూటికి నూరుశాతం నిజాయితీ ప‌రుల‌ని పోసాని స్టేట్మెంట్ ఇవ్వ‌డం విశేషం. తెలంగాణ భవిష్యత్తుకు కేటీఆర్ - హ‌రీశ్‌ రెండు కళ్లలాంటి వాళ్ల‌ని.. ఈ ఇద్ద‌రినీ తాను మొద‌ట్నుంచి ఫాలో అవుతున్నానని పోసాని చెప్పారు. కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డ వ్యక్తి కేటీఆర్ అని.. తండ్రి లాగే మంచి వ‌క్త అని పోసాని కితాబిచ్చారు. పోలీసులు - రాజకీయ వ్యవస్థల మధ్య ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి కేటీఆర్ అని.. వాటిని అన్నింటి గురించీ ఆయ‌న అధ్యయనం చేశారని అన్న పోసాని.. కేటీఆర్ చేసిన అవినీతి గురించి నిరూపిస్తే తన వ్యాఖ్య‌ల్ని వెనక్కి తీసుకుంటానని - టీఆర్ ఎస్‌ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80 వేల కోట్ల ఖర్చుతో పూర్తి చేశారని - అంత గొప్ప ప్రాజెక్టుని ప్రతిపక్షం కూడా అభినందించాలని.. ఇది కమిషన్ల కోసం అంటే తన లాంటి వాళ్లు బాధపడతారని పోసాని అన్నారు.
Tags:    

Similar News