చెంప‌దెబ్బ కొట్ట‌డంపై విల‌క్ష‌ణ న‌టుడి రియాక్ష‌న్

Update: 2021-11-07 07:30 GMT
సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `జైభీమ్` ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. 1993లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ  సంఘ‌ట‌నల‌ అధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. నాటి రోజుల్లో చెంచులు గిరిజ‌న‌ల జీవ‌న విధానాన్ని తెర‌పైకి తెచ్చిన తీరు ఆక‌ట్టుకుంది. ఓటీటీలో రిలీజ్ అయినా ఈ సినిమా పెద్ద ఎత్తున విజ‌యం సాధించింది. గిరిజ‌న హ‌క్కుల‌పై లాయ‌ర్ చంద్రు (సూర్య‌)  చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయంగా నిలిచింది. ఇందులో ప్ర‌కాష్ రాజ్ ఇన్ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ పెరుమాళ్ స్వామి  పాత్ర‌లో ఆద్యంతం ఆక‌ట్టుకున్నారు. అయితే ఈ పాత్ర కాస్త వివాదాస్ప‌ద‌మైంది. ఓ స‌న్నివేశంలో భాగంగా ప్ర‌కాష్ రాజ్ హిందీలో డైలాగులు చెప్పే వ్య‌క్తిని చెంప‌దెబ్బ కొట్టి..త‌మిళ్ లో మాట్లాడ‌మ‌ని అడుగుతారు.

ఇలా చెంప‌దెబ్బ కొట్ట‌డం..త‌మిళ్ లో మాట్లాడ‌మ‌న‌టం పెద్ద దుమారాన్నే రేపింది. ఇది కేవ‌లం ఉద్దేశ పూర్వ‌కంగా చేసిన ప్ర‌య‌త్నంగా క‌నిపించింది. దీంతో కొన్ని వ‌ర్గాలు ఈ స‌న్నివేశంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసాయి. తాజాగా ఈ వివాదంపై విల‌క్ష‌ణ న‌టుడు స్పందించారు. ``జైభీమ్ లో గిరిజ‌నుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని మీరు చూడ‌క‌పోతే.. చెంప‌దెబ్బ కొట్ట‌డం మీ ఎజెండాని బ‌హిర్గ‌తం చేస్తుంద‌``ని ఓ ఇంట‌ర్వ్యూలో సూటిగా చెప్పారు. స్క్రీన్ పై ప్ర‌కాష్ రాజ్ ఉన్నందున కొంద‌రికి చెంప‌దెబ్బ సీన్  చికాకు క‌ల్గించింద‌ని..ఇక్క‌డ (సినిమా) నా దృష్టంతా అన్యాయంపైనే  ఉంద‌న్నారు. మ‌నం న్యాయంగా ఉందామ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

ఇలాంటి వివాదాలు ప్ర‌కాష్ రాజ్ కి కొత్తేమీ కాదు. ఎలాంటి వివాదాన్నైనా త‌న‌దైన శైలిలో ఎదుర్కోవ‌డం విల‌క్ష‌ణ న‌టుడి ప్ర‌త్యేక‌త‌.  ఆఫ్ ది స్క్రీన్  అయినా..ఆన్ ది  స్క్రీన్ అయినా ప్ర‌కాష్ రాజ్ వివాదాల‌తో అంట‌కాగుతుంటారు. దానికి బ‌ల‌మైన కార‌ణాలు వెతుకుతారు. ఇటీవ‌లే టాలీవుడ్ లో  `మా` ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌కాష్ రాజ్ అద్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఓడిపోయినా రెండేళ్ల పాటు నీడ‌లా వెంటాడుతూనే ఉంటాన‌ని కొత్త అధ్య‌క్షుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించ‌డం ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News