ఢీ అంటే ఢీ అన్నారు.. ఇప్పుడు కలిసి పోయారు

Update: 2019-02-20 10:59 GMT
తమిళనాట నడిగర్‌ సంఘం ఎన్నికలు ఎప్పుడు కూడా హోరా హోరీగా సాగుతూ ఉంటాయి. నిర్మాతల మండలి ఎన్నికల విషయంలో కూడా ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. గత నడిగర్‌ ఎన్నికల సమయంలో విశాల్‌ ను సీనియర్‌ నటుడు రాధా రవి తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు, పెద్ద ఎత్తున విశాల్‌ పై ఆరోపణలు చేశాడు. విశాల్‌ ను నడిగర్‌ సంఘంలో ఉండకూండా రాధా రవి ప్రయత్నించాడంటూ ప్రచారం జరిగింది. ఆ గొడవ తర్వాత మళ్లీ వీరిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారని ఏ ఒక్కరు కూడా అనుకోలేదు. కాని ఒకరి మొహం ఒకరు చూసుకోవడం ఏం కర్మా ఏకంగా ఒకే సినిమాలో ఇద్దరు కలిసి నటిస్తున్నారు.

ప్రస్తుతం విశాల్‌ హీరోగా రూపొందుతున్న 'అయోగ్య' చిత్రంలో రాధా రవి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. విశాల్‌ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్నాడు. అలాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో రాధా రవి నటించడం విశేషం. తాజాగా విశాల్‌ తో కలిసి నటించడంపై రాధా రవి మాట్లాడుతూ.. నడిగర్‌ సంఘం ఎన్నికలు వేరు, సినిమాలో నటించడం వేరు.

నడిగర్‌ సంఘం విషయంలో తాను విశాల్‌ ను విభేదించినా కూడా నటన పరంగా మాత్రం ఆయనతో నటించేందుకు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటాను. ప్రస్తుతం విశాల్‌ తో షూటింగ్‌ చాలా జాలీగా సాగుతుందని రాధారవి చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లో శత్రువులు ఉంటారు కాని వ్యక్తిగతంగా మాత్రం శత్రువులు ఉండరు అన్నట్లుగానే నడిగర్‌ సంఘం విషయంలో విశాల్‌ రాధారవి శత్రువులు కాని, నటన పరంగా మాత్రం కాదట.
Tags:    

Similar News