రేణు దేశాయ్ తప్పుకుందిగా

Update: 2018-06-26 10:21 GMT
ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే  చూస్తున్న కొందరు అభిమానుల కామెంట్స్ దాడి ఎక్కువ కావడంతో రేణు దేశాయ్ ట్విట్టర్ నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన వ్యక్తిగత విషయాలతో పాటు పిల్లలకు సంబంధించిన పిక్స్ రెగ్యులర్ గా పోస్ట్ చేసే రేణు దేశాయ్ రెండో పెళ్లి నేపథ్యంలో ఇలా చేయటం విశేషమే. నిజానికి కొద్ది రోజుల క్రితం తనను టార్గెట్ చేసే వాళ్ళను సోషల్ మీడియాలో  అయినాసరే  వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెప్పిన రేణు దేశాయ్ తక్కువ టైంలోనే మనసు మార్చుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. తన చివరి ట్వీట్ లో సుదీర్ఘమైన మెసేజ్ పెట్టిన రేణు ట్విట్టర్ లో నెగిటివిటీ ఎక్కువగా ఉందని వృత్తిలో సంతృప్తి లేక సినిమా రాజకీయ రంగానికి చెందిన వాళ్ళ మీద విషం కక్కడమే పనిగా పెట్టుకున్న వాళ్ళ నుంచి దూరంగా వెళ్లిపోవడమే ఉత్తమమని అందులో పేర్కొంది.

తనకు కామెంట్స్ పెడుతున్న వాళ్లలో అధికంగా అజ్ఞాతవ్యక్తులతో పాటు ఎలాంటి పని లేని వాళ్ళతో చిరాకు వస్తోందని అందుకే వైదొలుగుతున్నట్టు స్పష్టం చేసారు. ఆ తర్వాత కాసేపటికే ట్విట్టర్ లో రేణు దేశాయ్ పేరుతో సెర్చ్ చేస్తే రిజల్ట్స్ చూపించడం లేదు. దాన్ని బట్టే తన నిర్ణయం పట్ల కట్టుబడి ఉందని అర్థమైంది. ఇక కొందరు పవన్ ఫాన్స్ పేరిట చేస్తున్న ఓవర్ యాక్షన్ మాత్రం మామూలుగా లేదు. తమ దేవుడికి అన్యాయం చేసి రెండో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని సింగల్ విమెన్ గా కూడా ఎన్నో సాధించవచ్చని అర్థం లేని కామెంట్స్ పెట్టారు. ఇంకొందరు హద్దులుదాటి కామెంట్స్ పెట్టారు.  రేణు దేశాయ్ వెంటనే అలెర్ట్ అయి సన్నిహితుల  సలహా మేరకు ఇన్స్ స్టాగ్రామ్ ను కొత్తవాళ్ళెవరూ చూసే అవకాశం లేకుండా కామెంట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా సెటింగ్స్ మార్చినట్టు తెలిసింది. ఇదిలా ఉంచితే ఈ ఇష్యూతో ఎలాంటి సంబంధం లేని  రేణు దేశాయ్ భర్త ఎవరో బయటి ప్రపంచానికి తెలియక ముందే హాట్ టాపిక్ గా మారిపోయాడు.

రేణు దేశాయ్ సోషల్ మీడియా నుంచి ఎదురుకుంటున్న సమస్యలకు మద్దతుగా కత్తి మహేష్-దర్శకురాలు నందిని రెడ్డి గళం విప్పారు. కొందరు ఫాన్స్ చేసే ఇలాంటి చర్యల వల్ల పవన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కత్తి మహేష్ చెప్పగా సున్నితంగా వ్యవహరించే పవన్ ఇలాంటి  పోకడను ఎంత మాత్రం ఉపేక్షించారని అనవసరంగా ఇబ్బంది పెట్టి చెడ్డ పేరు తీసుకురాకండి అని నందిని రెడ్డి హితవు పలికారు. మొత్తానికి నిశ్చితార్థం జరిగాక కూడా తమ కామెంట్స్ ద్వారా రేణు దేశాయ్ ని సోషల్ మీడియా నుంచి వైదొలగేలా చేసిన  ధోరణి మాత్రం సరికాదు. పవన్ స్వయంగా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసాక కూడా ఇలాంటివి కొనసాగటం మాత్రం క్షమార్హం కాదు. అభిమానులుగా చెప్పుకుంటున్న వారు తమకు తాము తప్పా ఒప్పా  తెలుసుకోవాల్సిందే తప్ప ఎవరు మాత్రం చేయగలిగింది ఏమి లేదు.
Tags:    

Similar News