‘లై’ ద్వితీయ విఘ్నాన్ని దాటుతుందా?

Update: 2017-08-09 17:30 GMT
హను రాఘవపూడి ప్రతిభావంతుడైన దర్శకుడని అతడి తొలి సినిమా ‘అందాల రాక్షసి’తోనే రుజువైంది. ఆ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడి ముద్ర కనిపిస్తుంది. హను అభిరుచి ఏంటన్నది తెలుస్తుంది. కాకపోతే ఆ సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దలేకపోయాడు హను. ఓ దశ వరకు సినిమా బాగానే సాగుతుంది కానీ.. ఆ తర్వాత ట్రాక్ తప్పుతుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఓ దశ దాటాక సినిమా అదోలా తయారవుతుంది. చివరికి వచ్చేసరికి ప్రేక్షకులకు డిస్కనెక్ట్ అయిపోతుంది. హను రెండో సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సంగతి తీసుకున్నా అంతే. ప్రథమార్ధమంతా చక్కటి ప్రేమకథతో ఆహ్లాదంగా సాగుతుంది. ఇంటర్వెల్ దగ్గర సినిమా పతాక స్థాయిని అందుకున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో పూర్తిగా ట్రాక్ తప్పి.. నిరాశ పరుస్తుంది. హను తొలి రెండు సినిమాలు చూసి అతను సగం వరకే సినిమాలు బాగా తీస్తాడని.. మిగతా సగం తేల్చేస్తాడని తేల్చేశారు జనాలు.

మరి ఇప్పుడు ‘లై’ విషయంలో ఏం జరుగుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలోనూ ప్రథమార్ధం వినోదాత్మకంగా.. సరదాగా సాగిపోతుందని అంటున్నారు. ద్వితీయార్ధంలో హీరో-విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ సీరియస్ గా సాగుతుందని చెబుతున్నారు. టాలీవుడ్లో చాలా వరకు సినిమాలు ఇదే ఫార్ములాతో సాగుతుంటాయి. ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ ను సరదాగా నడిపించేసి.. ఇంటర్వెల్ ముంగిట అసలు కథలోకి వెళ్తుంటారు. ఆ కథను ఎంత పకడ్బందీగా నడిపిస్తారన్నదాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ‘లై’ విషయంలోనూ ఇదే ఫార్ములాను అప్లై చేసుకోవచ్చు. తన తొలి రెండు సినిమాల్లో ద్వితీయార్ధాన్ని అనుకున్నంత బాగా నడిపించడంలో విఫలమైన హను రాఘవపూడి.. ‘లై’ విషయంలో సెకండాఫ్ కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండాఫ్ ఇంటెన్స్ గా ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చింది చిత్ర బృందం. మరి ఆ ఇంటెన్సిటీ ఏమాత్రం ఉందో.. హను ‘లై’తో అయినా ‘ద్వితీయార్ధ’ విఘ్నాన్ని దాటుతాడేమో చూడాలి.
Tags:    

Similar News