ట్విట్టర్ లో అడుగుపెట్టిన 'మహానుభావుడు'

Update: 2020-03-29 14:15 GMT
మన టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు సినిమా ప్రచారానికి కూడా సోషల్ మీడియా కీలకంగా మారింది. కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా ద్వారా సినిమా పాటలు, సీన్లు తదితరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి సినిమాలకు విపరీతంగా ఉచిత ప్రచారం దొరుకుతోంది. ఇప్పుడు రీసెంటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యాడు. వచ్చీ రావడంతోనే సోషల్ మీడియాలలో పోస్టుల వర్షం కురిపిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం మెగాస్టార్ కి స్వాగతం పలికింది. ఇప్పటికే స్టార్ హీరోలైన అక్కినేనిక నాగార్జున - విక్టరీ వెంకటేష్ - మహేష్ బాబు - ఎన్టీఆర్ - నాగచైతన్య మొదలైన వారు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకొని చిరు తనయుడు రామ్ చరణ్ కూడా ట్విట్టర్ లో అడుగు పెట్టాడు.

ఇప్పుడు తాజాగా తన ఫ్రెండ్ రామ్ చరణ్ దారిలో నడుస్తూ యువ హీరో శర్వానంద్ కూడా ట్విట్టర్ లో కాలుమోపాడు. వచ్చీ రావడంతోనే కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం 'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండమని సూచించాడు. ఇది యాదృచ్చికంగా జరిగినా శర్వానంద్ నటించిన 'మహానుభావుడు' మూవీలో అతని క్యారెక్టర్ ఓసీడీతో వైరస్ అటాక్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అదే రీతిలో ప్రజల్ని కూడా ఉండమని చెప్తున్నాడు. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం వల్ల ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ అయింది. షూటింగులు లేక ఖాళీగా ఉన్న సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉండగా శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం చిత్రంలో నటిస్తున్నాడు. 


Tags:    

Similar News