గంగూలీకే తుపాకీ గురిపెట్టారు

Update: 2016-12-30 09:17 GMT
గంగూలీ అంటే బెంగాల్ టైగర్.. టీమిండియాకు ధైర్యం, దూకుడు నేర్పిన ఘనత ఆయనదే. ప్రత్యర్థి టీంలు స్లెడ్జింగ్ చేస్తే ఉడుక్కుని సరిగ్గా ఆడలేక ఓడిపోయే టీమిండియా ఆటగాళ్లను రాటుదేలేలా నడిపించిన తొలి డ్యాషింగ్ కెప్టెన్ నిస్సందేహంగా గంగూలీయే. అలాంటి గంగూలీ తలకు ఓ వ్యక్తి తుపాకీ గురిపెట్టాడట. దాంతో గంగూలీ ఆ రోజుతో తన పనైపోయిందని టెన్షన్ పడ్డాడట. కంగారు పడకండి.. ఇది ఇప్పటి ఘటన కాదు, అప్పుడెప్పుడో గంగూలీ కెరీర్ తొలినాళ్లలోని ఘటన. ఆ సంగతి ఇప్పుడు గంగూలీ తన పుస్తకంలో రాసేసరికి అందరికీ తెలిసింది.
    
టీమిండియా మాజీ కెప్టెన్ - బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల విడుదలైన ఓ పుస్తకంలో గత జ్ఞాపకాలను పంచుకున్నాడు. 1996లో తన తొలి టెస్టు సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్నప్పుడు జరిగిన ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. సిరీస్ మధ్యలో తన బంధువులను కలిసేందుకు కావెండాష్ నుంచి పిన్నార్ కు లండన్ అండర్ గ్రౌండ్ ట్రెయిన్ లో వెళ్లాడట. అతనితో పాటు సిద్ధూ కూడా ఉన్నాడు. వాళ్లు కూర్చున్న క్యారేజ్ లోనే ఇద్దరు అబ్బాయిలు - ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. వారిలో ఒకడు బీరు తాగి - ఆ క్యాన్ ను వీరిపైకి విసిరేశాడు. దీంతో, సిద్దూ సీరియస్ అయ్యాడు. గంగూలీ వారించినా సిద్దూ తగ్గలేదు. దీంతో - చేసేదేమీ లేక సిధ్దూతో పాటు గంగూలీ కూడా గొడవలోకి దిగాడు. అయితే, ఊహించని విధంగా వారిలో ఒకడు రివాల్వర్ తీసి, గంగూలీ తలకు  గురిపెట్టాడు. ఆ సందర్భంతో తన జీవితం ఈ ట్రెయిన్ లోనే ముగిసిపోయిందని గంగూలీ అనుకున్నాడట.
    
అయితే అదృష్టవశాత్తు ఆ గ్యాంగులోని ఓ అమ్మాయి ఆ అబ్బాయిని వెనక్కి లాగేసిందట. అంతలోనే స్టేషన్ కూడా రావడంతో రైళ్లో నుంచి గంగూలీ, సిద్ధూ ఇద్దరూ దిగిపోయారట. ఆ తర్వాత లండన్ లో ఎప్పుడు తిరగాలని అనిపించినా... కారులోనే తిరిగాడట గంగూలీ.  మళ్లీ ట్రైను ఎక్కలేదట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News