అప్పట్లో ఒకడు పెద్ద రిస్క్ చేస్తున్నాడే..

Update: 2017-03-08 06:40 GMT
చిన్న చిన్న పాత్రలతోనే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించి.. ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశాడు శ్రీవిష్ణు. ఈ సినిమా తర్వాత శ్రీవిష్ణును జనాలు చూసే కోణమే మారిపోయింది. అతడి ఫ్యూచర్ ప్రాజెక్టులపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ‘అప్పట్లో..’తర్వాత కుమార్ వట్టి అనే కొత్త దర్శకుడితో అతను ‘మా అబ్బాయి’ అనే సినిమా చేశాడు. శ్రీవిష్ణు సోలో హీరోగా నటించిన తొలి సినిమా ఇది. ఇటీవలే ఆడియో కూడా విడుదలైంది. ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేయాలని నిర్ణయించారు. ఐతే శ్రీవిష్ణు కొంచెం క్రేజ్ సంపాదించుకున్న నేపథ్యంలో సినిమాకు పెద్దగా పబ్లిసిటీ చేయకుండా.. అన్ సీజన్లో రిలీజ్ చేయాలనుకోవడం కరెక్టేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

మార్చి 2-3 వారాలు సినిమాలకు గడ్డు కాలమే. విద్యార్థులు పరీక్షల హడావుడిలో ఉండటంతో థియేటర్లకు రారు. వీళ్లతో పాటే ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు దూరమవుతాయి. ‘మా అబ్బాయి’ చూస్తుంటే యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంది. ఈ నేపథ్యంలో 17న రిలీజ్ అంటే రిస్కే అని చెప్పాలి. ఐతే మార్చి చివరి వారం నుంచి పెద్ద సినిమాల తాకిడి మొదలవుతుంది. ఇక సమ్మర్ అంతా భారీ సినిమాల హంగామానే కొనసాగుతుంది. కాబట్టి తర్వాత థియేటర్లు దొరకడం కష్టమని అన్ సీజన్లోనే సినిమాను రిలీజ్ చేసేద్దామని ఫిక్సయినట్లుంది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కూడా సంక్రాంతికి ముందు స్లంప్ ఉన్న టైంలో రిలీజై మంచి ఫలితాన్నందుకుంది. అదే ధీమాతో ‘మా అబ్బాయి’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లున్నారు.
Tags:    

Similar News