డ్ర‌గ్స్ నోటీసులొస్తే.. కేసు పెట్టిన‌ట్లు కాదుగా?

Update: 2017-07-16 07:04 GMT
టాలీవుడ్ లో దుమ్ము దుమారం రేపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విప‌రీత‌మైన సంచ‌ల‌నాన్ని రేపుతున్న డ్ర‌గ్స్ కేసుపై ప్ర‌ముఖ సినీ న‌టుడు సుమ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌డిచిన మూడు రోజులుగా డ్ర‌గ్స్ కేసుపై మీడియాలో వస్తున్న క‌థ‌నాల సంగ‌తి తెలిసిందే.

డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌లో భాగంగా ప‌లువురుసినీ ప్ర‌ముఖుల‌కు అధికారులు నోటీసులు ఇవ్వ‌టం.. దీనికి సంబంధించిన పేర్లు మీడియాలో బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. మీడియాలో వ‌చ్చిన కాసేప‌టికే.. ఎవ‌రికి వారు డ్ర‌గ్స్ తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఖండించ‌టంతో పాటు విచార‌ణ అధికారుల‌కు కూడా అదే విష‌యాన్ని చెబుతామ‌న్నారు. మీడియా ముందుకు రాని ఒక‌రిద్ద‌రు సైతం సోష‌ల్ మీడియాలో త‌మ‌దైన శైలిలో స్పందించారు.

ఇదిలా ఉంటే.. డ్ర‌గ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారి పేర్ల‌ను మీడియా బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కుండా ఉండాల్సింద‌ని న‌టుడు సుమ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. నోటీసులు జారీ చేసినంత మాత్రానా కేసులు న‌మోదైన‌ట్లు కాదు క‌దా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ సంస్కృతి పెరిగింన్నారు. డ్ర‌గ్స్ మ‌త్తులో మునిగితే స‌మ‌స్య‌లు పెరుగుతాయే కానీ త‌గ్గ‌వ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్టీఆర్‌.. ఏఎన్నార్ లాంటి ప్ర‌ముఖులు త‌మ వ్య‌క్తిత్వంతో గొప్ప‌గా తీర్చిదిద్దుకొని ఆద‌ర్శంగా నిలిచార‌ని.. యువ‌న‌టులు టాలెంట్ తో పాటు.. వ్య‌క్తిత్వం కూడా చాలా ముఖ్య‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూద‌ద‌ని వ్యాఖ్యానించారు. డ్ర‌గ్స్ కేసు ఎపిసోడ్ లో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారికి నోటీసులు ఇచ్చిన వారి పేర్లు బ‌య‌ట‌కు రావ‌టంపై ప‌లువురు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. తాజాగా సుమ‌న్ కూడా ఆ జాబితాలో చేరాన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News