తెలుగు తెర జేమ్స్ బాండ్ .. కృష్ణ

Update: 2022-05-31 07:58 GMT
కృష్ణ .. ఈ పేరుకు ముందు సూపర్ స్టార్ అనే బిరుదు జోడించకపోతే అదో లోపంగా ఉంటుంది. కాలేజ్ రోజుల్లోనే కృష్ణకి అందగాడిగా మంచి ఫాలోయింగ్ ఉండేది. అందుకు తగినట్టిగానే ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. అదే ఆయనను సినిమాలలో ప్రయత్నాలు చేసేలా చేసింది. ఆ ప్రయత్నాలు ఫలించి 'తేనె మనసులు' సినిమాలో తొలి అవకాశం లభించింది. 1965లో వచ్చిన ఈ సినిమాతో, తొలి ప్రయత్నంలోనే ఆయన హిట్ అను అందుకున్నారు. ఇక అప్పటి నుంచి కృష్ణ వెనుదిరిగి చూసుకోలేదు.  

కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సరికి ఎన్టీఆర్  .. ఏఎన్నార్ .. కాంతారావు తిరుగులేని స్టార్స్ గా దూసుకుపోతున్నారు. మరో కొత్త హీరోను గురించి ఇండస్ట్రీ గానీ .. ప్రేక్షకులు గాని ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ల ముగ్గురూ తమ జోరును చూపిస్తున్నారు.  పౌరాణికాలలో ఎన్టీఆర్ .. రొమాంటిక్ సాంఘిక చిత్రాలలో ఏఎన్నార్ .. జానపదాలలో కాంతారావు తమ  ప్రత్యేకతను  చాటుతూ దూసుకుపోతున్నారు. ఈ ముగ్గురికీ భిన్నమైన రూట్లో ముందుకు వెళితేనే తాను ఇండస్ట్రీలో నిలబడటం కుదురుతుందనే విషయం కృష్ణకి అర్థమైపోయింది.  

అలాంటి సమయంలోనే వచ్చిన ' గూఢచారి 116' సినిమాలో ఆయన ఉత్సాహంగా నటించారు. తెలుగులో ఈ తరహా యాక్షన్ సినిమా రావడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో వచ్చిన టాక్ తో కృష్ణకి 20 సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడం అప్పట్లో జరిగిన ఒక అద్భుతం.

'ఆంధ్ర జేమ్స్ బాండ్' అని అభిమానులు ఆయనను పిలుచుకోవడం అప్పటి నుంచే మొదలైంది. అలా ఆయన తనకంటే ముందు స్టార్ హీరోలైన ఎన్టీఆర్  .. ఏఎన్నార్ .. కాంతారావు పోటీని తట్టుకుని నిలబడ్డారు. ఇక ఆ తరువాత వచ్చిన కృష్ణంరాజు - శోభన్ బాబుల ధాటిని కూడా ఆయన తట్టుకోవడం విశేషం.   

అప్పట్లో కుటుంబ కథాచిత్రాల్లోను కృష్ణ ఒక వెలుగు వెలిగారు. ఆయన పంచె కట్టి ..  ముల్లుగర్ర చేతబట్టి  పల్లెటూరి బుల్లోడిలా పొలం గట్లపై నడుస్తుంటే అభిమానులు మురిసిపోయారు. టైట్ క్లోజప్ షాట్స్ లోను అందంగా కనిపించే హీరోగా ఆయనకి మంచి పేరు ఉంది. ఎంత  పెద్ద డైలాగ్ అయినా గుర్తు పెట్టుకుని సింగిల్ టేక్ లో చేయడం .. డబ్బింగ్ ను కూడా చాలా ఫాస్టుగా చెప్పడం ఆయన ప్రత్యేకతలుగా చెబుతారు. ఆయన నటన సంగతి అలా ఉంచితే .. మల్లెపూవులాంటి మనసున్నవారని ఇప్పటికీ  చెప్పుకుంటూ ఉంటారు.

4 దశాబ్దాల కాలంలో 300 సినిమాలే పైగా చేశారు. 'గూఢచారి 116'తో తొలి జేమ్స్ బాండ్ సినిమాను తెలుగు తెరకి పరిచయం చేసిన కృష్ణ, ఆ తరువాత 'మోసగాళ్లకు మోసగాడు'  సినిమాతో తొలి కౌబోయ్ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. తొలి పూర్తిస్థాయి సినిమా స్కోప్ గా 'అల్లూరి సీతారామరాజు' సినిమాను ... తొలి 70MM సినిమాగా 'సింహాసనం' నిర్మించిన ఘనత   ఆయన సొంతం. ఇలా కృష్ణ  అడుగడుగునా సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లడం ఆయన కెరియర్లో కనిపిస్తుంది. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం!
Tags:    

Similar News