సినిమాలు ఫుల్... థియేటర్లు?

Update: 2018-02-23 05:49 GMT
పరీక్షల టైం వచ్చేసింది. పిల్లలంతా ఆ టెన్షన్ లో పడ్డారు. తల్లిదండ్రుల ఫోకస్ కూడా పిల్లల పరీక్షపైనే ఉంటుంది. ఈ సమయంలో సాధారణంగా ఫ్యామిలీస్ సినిమాలకు రావడం తక్కువ. పరీక్షల బిజీలో ఉండే యూత్ కూడా పెద్గగా రారు. దీంతో పెద్ద హీరోలెవరూ ఈ సీజన్ లో సినిమా రిలీజులు ప్లాన్ చేసుకోలేదు. దీంతో శుక్రవారం వచ్చినా థియేటర్లలో సందడి కనిపించడం లేదు.

పెద్ద సినిమాలేవీ పోటీలో లేకపోవడంతో తక్కువ.. మీడియం బడ్జెట్ సినిమాలకు కాలం కలిసొచ్చింది. ఈవారం జువ్వ.. రారా.. చల్తే.. హైదరాబాద్ లవ్ స్టోరీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో రారా సినిమా నిన్నటి తరం హీరో శ్రీకాంత్ నది. మిగతా మూడూ కొత్త హీరోలు నటించిన సినిమాలే. వీటితోపాటు హీరో విక్రమ్ - మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటించిన స్కెచ్ మూవీ కూడా తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయింది. ఇన్ని సినిమాలు థియేటర్లకు వచ్చినా దాని తాలూకు సందడి మాత్రం ఎక్కడాలేదు.

ఒకప్పుడు తెలుగులో విక్రమ్ కు మంచి ఇమేజ్ ఉన్నా వరస ఫ్లాపులు... అరవ అతి ఎక్కువగా ఉన్న సినిమాలు చేయడంతో ఇక్కడ ప్రేక్షకులు విక్రమ్ సినిమాలు చూడ్డం మానేశారు. దానికితోడు ఈ సినిమాకు ప్రమోషన్ వర్క్ అంటూ ఏమీ చేయలేదు. అవకాశం దొరికింది కదా అని ఆరాటంగా సినిమాలు రిలీజ్ చేయడమే తప్ప ఇవి బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకునే ఛాయలేవీ కనిపించడం లేదు. దాదాపుగా నెలరోజులు థియేటర్ల వద్ద ఇదే పరిస్థితి కొనసాగనుంది.


Tags:    

Similar News