ఎన్టీఆర్... నందమూరి తారక రామారావు పేరు చెబితే యావత్ సినీ అభిమానులు ఎగిరిగంతేస్తారు!! తెలుగు సినిమా చరిత్రలో ఆయనకున్న స్థానం ప్రత్యేకం.. మరెవరికీ అందనంత ఉన్నతం. నటుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా ఎన్టీఆర్ స్థానం కచ్చితంగా స్పెషలే! అన్నివర్గాలకూ రాజకీయాలను పరిచయం చేయడం, రాజకీయాల్లో స్థానం కల్పించడం ఆయన చేసినపనే అనేది తెలిసిన విషయమే! అయితే ఇలాంటి ఎన్టీఆర్ కు ఇప్పటివరకూ భారత రత్న రాలేదు. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే... ఆయన తెలుగువారి గుండెల్లో ఎప్పుడూ రత్నమే!! అయితే తాజాగా ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఆయనకు గుడికట్టారు.
సాదారణంగా వ్యక్తులకు గుడికట్టడం అనే సంస్కృతి తెలుగునాటలేదనే చెప్పాలి. కానీ ఈ పద్దతి తమిళంలో జోరుగా సాగుతుంటుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ - ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత - సినీనటులు కుష్బూ, నమిత ఇలా మొదలైన వారికి వారి వారి అభిమానులు విగ్రహాలు పెట్టించారు, ఆలయాలు కట్టించారు. అయితే తాజాగా ఎన్టీఆర్ కు విగ్రం కట్టింది చిత్తూరుకు చెందిన పి. శ్రీనివాసులు అనే వ్యక్తి!! ఈయనేమీ డబ్బున్న వ్యక్తి కాదు, పెద్ద బిజినెస్ మేన్ అంతకన్నా కాదు... ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బులేని వ్యక్తి!! డబ్బులేకపోతేనేం... అన్నగారిపై అభిమానం ఉంది. ప్రభుత్వం నెల నెలా ఇచ్చే వృధాప్య పింఛన్ తీసుకుంటూ చిన్న బడ్డీకొట్టు నడుపుకునే ఈయన వెలకట్టలేని తన వీరాభిమానంతో ఈ గుడికట్టేశాడు.
తనకున్న కొద్దిపాటి ఆర్థిక వెసులుబాటుతోనే చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని కంచనపల్లె గ్రామంలో అన్నగారికి టెంపుల్ కట్టాడు.. విగ్రహానికి పూజలు చేసేందుకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాడు. కానీ... అక్కడికే ఆయనకు సమస్యలు తలెత్తాయి! ఎన్టీఆర్ విగ్రహానికి నిత్యం పూజలు చేయాలంటే రోజూ ఖర్చు చాలా అవుతుందని, అది తాను భరించగలిగే స్థాయిలో లేనని తన సన్నిహితుల వద్ద శ్రీనివాసులు వాపోతున్నాడట. ఈ విషయం ఇంతకాలం వెలుగులోకి రాలేదు కాబట్టి కానీ... ఇప్పుడిక శ్రీనివాసులుకి ఈ సమస్య ఉండకపోవచ్చేమో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/