సెట్స్ మీదున్న 'కన్నడ పవర్ స్టార్' సినిమాలు ఇవే..!

Update: 2021-10-30 03:53 GMT
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి లోనయింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడి ఆకస్మిక మరణం పట్ల యావత్ చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది. అప్పూ మరణ వార్త విని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లాలిపోయారనే వాస్తవాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా ‘యువరత్న’ సినిమాలో కనిపించారు. సంతోష్ ఆనంద్రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 'కేజీఎఫ్' నిర్మాత విజయ్ కిరగందూర్.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ పరిస్థితుల్లో 2021 ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో ఏప్రిల్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి పెట్టారు.

'యువరత్న' తర్వాత పునీత్ రాజ్ కుమార్ నటించే ప్రతీ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సెట్స్ మీదున్న 'జేమ్స్' మరియు 'ద్విత్వ' చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న 'జేమ్స్' సినిమా తదుపరి షెడ్యూల్ ను నవంబర్ లో ప్లాన్ చేశారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కూడా కీ రోల్ ప్లే చేశారు.

ఇక 'ద్విత్వ' చిత్రానికి 'యూ-టర్న్' ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించాల్సి ఉంది. ‘కేజీఎఫ్’ నిర్మాతలు హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ సైకాలజికల్ థ్రిల్లర్ డ్రామాలో త్రిష ను హీరోయిన్ గా అనుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని.. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ అప్పట్లో ప్రకటించారు. యాదృచ్ఛికంగా ఈ రోజు దర్శకుడు పవన్ కుమార్ పుట్టినరోజు కావడంతో ద్విత్వ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. అయితే అందరూ పునీత్ ఇక లేరనే మరణవార్త వినాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే పునీత్ రాజ్ కుమార్ PRK ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ వచ్చారు. 'కవులదారి' 'మాయాబజార్ 2౦16' 'లా' 'ఫ్రెంచ్ బిరియాని' వంటి చిత్రాలను పునీత్ నిర్మించారు. ప్రస్తుతం ఈ బ్యానర్ మీద 'ఫ్యామిలీ ప్యాక్' మరియు 'వన్ కట్ టూ కట్ ఫ్లవర్ ఈజ్ కేమ్' అనే రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కన్నడ పవర్ స్టార్ పునీత్ కు నివాళిగా ఆయన నటిస్తున్న నిర్మిస్తున్న సినిమాలను విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా, లెజెండరీ యాక్టర్ కంఠీరవ రాజ్ కుమార్ - పార్వతమ్మ దంపతుల మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్. 1975 మార్చి 17న మద్రాస్ లో జన్మించారు. పునీత్ కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు అతని కుటుంబం మైసూర్ కు వెళ్లి స్థిరపడింది. ఆయన సోదరుడు శివ రాజ్ కుమార్ ప్రస్తుతం కన్నడ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. 1999 లో అశ్విని రేవంత్ ని వివాహం చేసుకున్నారు. పునీత్ - అశ్విని దంపతులకు ధృతి - వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన పునీత్ రాజ్ కుమార్ 'బెట్టాడ హూవు' సినిమాకు గానూ ఉత్తమ బాలనటుడుగా జాతీయ అవార్డును అందుకున్నారు. 2002లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'అప్పు' సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అభి - వీర కన్నడిగ - అజయ్ - అరసు - జాకీ - రామ్ - హుడుగారు - అంజనీ పుత్ర - పవర్ - చక్రవ్యూహ - రాజకుమార - యువరత్న వంటి 29 చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. కన్నడ పవర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన పునీత్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ క్రమంలో అశేష అభిమానులను ఏర్పరచుకున్నారు. ఫ్యాన్స్ ఆయన్ని ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు. ఇప్పుడు వారందరిని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు పునీత్.


Tags:    

Similar News