తమిళ స్టార్ హీరో - ఇళయ దళపతి విజయ్ నటించిన 'మెర్సల్' బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతోంది. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ. 150 కోట్ల కలెక్ట్ చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో హిట్ సినిమాల విడుదలకు ముందో - తరువాతో వివాదాలు వెంటాడడం పరిపాటి. అదే తరహాలో మెర్సల్ సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన చారిత్రాత్మక జీఎస్టీ విధానం పై ఈ సినిమాలో ఉన్న డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మోడీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్న ఆ డైలాగులను సినిమా లో నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మెర్సల్ చిత్రంలో హీరో విజయ్...జీఎస్టీ గురించి చెప్పిన కొన్ని డైలాగులపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ''సింగపూర్ లో 7 శాతం జీఎస్టీ మాత్రమే ఉంది. అక్కడి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. భారత్ లో 28 శాతం జీఎస్టీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉచిత వైద్య సదుపాయాలు లేవు'' అని విజయ్ కొన్ని డైలాగులు చెప్పాడు. భారత్ లో మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానాన్ని అపహాస్యం చేసేలా ఆ డైలాగులున్నాయని బీజేపీ నేతలు బహిరంగంగా ఖండించారు. జీఎస్టీ విధానాన్ని వక్రీకరించేలా ఆ డైలాగులున్నాయని, వెంటనే ఆ డైలాగులను తొలగించాలని చిత్ర నిర్మాతలకు చెప్పారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు - కేంద్రం నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయని వినికిడి. దీంతో, చిత్ర నిర్మాత ఆ డైలాగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.