పైకోర్టులో కేజీఎఫ్ నిర్మాత‌ల గెలుపు

Update: 2019-09-28 07:14 GMT
ఇటీవ‌ల సినిమాల నిర్మాణం ఎంత కాంప్లికేటెడ్ అయ్యిందో తెలిసిందే. డైరెక్టుగా సెట్స్ కి వ‌చ్చి మ‌నోభావాలు దెబ్బ తిన్నాయ‌ని జ‌నాలు క‌ల‌బ‌డుతున్నారు. ఆ అనుభ‌వం సంజయ్ లీలా భాన్సాలీ అంత‌టివాడికే ఎదురైంది. ప‌ద్మావ‌త్ రిలీజ్ ముందు రాజ్ పుత్ ల ఎటాక్ ల‌ను జ‌నం అంత తేలిగ్గా మర్చిపోలేరు. ప్ర‌స్తుతం సైరా - న‌ర‌సింహారెడ్డి రిలీజ్ ముందు ఉయ్యాల‌వాడ న‌ట‌వార‌సుల ఎటాక్స్ గురించి అంతే ఇదిగా మాట్లాడుకుంటున్నారు. ఇవి రెండూ భారీ పాన్ ఇండియా సినిమాలు. వాల్మీకి.. నానీస్ గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాల‌కు ఎదురైన తిప్ప‌లు తెలిసిందే.

తాజాగా మ‌రో భారీ పాన్ ఇండియా సినిమా.. కేజీఎఫ్ 2 విష‌యంలో త‌లెత్తిన‌ వివాదం వీట‌న్నిటికంటే విరుద్ధ‌మైన‌ది. కేజీఎఫ్ సీక్వెల్ కోసం ప‌ర్యావ‌ర‌ణానికి హాని చేస్తున్నార‌ని .. ఆ ప్రాంతాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని ఏకంగా కోలార్ ఫీల్డ్స్ లోని స్థానికులే కోర్టుల‌కు వెళ్ల‌డంతో షూటింగ్ కి పెద్ద అవాంత‌రం ఏర్ప‌డింది. కొంత‌కాలంగా అధీరా పాత్ర‌ధారి సంజ‌య్ ద‌త్ పై చిత్రీక‌ర‌ణ చేయాల‌ని భావించినా షూటింగు ఆపేసి ఎదురు చూడాల్సి వ‌చ్చింది. ఇటీవ‌లే ద‌త్ జీ ఆన్ లొకేష‌న్  ఫోటో ఒక‌టి రిలీజైనా అక్క‌డ షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు క‌నిపించ‌లేదు.

అప్ప‌టికే కోర్టులో కేసు నడుస్తుండ‌డంతో కేజీఎఫ్  టీమ్ వేచి చూస్తోంద‌ని అర్థ‌మైంది. కోలార్ ఫీల్డ్స్ లో వాతావ‌ర‌ణ కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్నందున షూటింగ్ ఆపాల్సిందిగా కోర్టులో వేసిన‌ పిటీష‌న్ తో మ‌ధ్యంత‌రంగా షూటింగుని ఆపేయాల‌ని సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ అంత‌రాయం నేప‌థ్యంలో కేజీఎఫ్ 2 నిర్మాత‌లు కేర‌ళ హైకోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. తాజాగా అత్యున్న‌త న్యాయ‌స్థానంలో తీర్పు వెలువ‌డింది. చిత్ర‌బృందానికి రిలీఫ్ నిస్తూ.. ఇక‌పై షూటింగ్ మొద‌లు పెట్టుకోవ‌చ్చున‌ని తీర్పు వెలువ‌డింది. కానీ నిర్మాత ఒక గ్యారెంటీ ఇవ్వాలి. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం జ‌ర‌గ‌దని ..  అందుకు ప‌రిహారంగా మొక్క‌లు నాటాల‌ని కోర్టు తీర్పు వెలువ‌డింది. అందుకు చిత్ర‌ నిర్మాత‌లు అంగీక‌రించారు. షూటింగ్ అయిపోగానే 500 మొక్క‌లు ఆ ప్రాంతంలో నాటుతామ‌ని కోర్టుకు విన్న‌వించారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన కార్తీక్ గౌడ హైకోర్టులో దీనికి అంగీకారం తెలిపారు. కేజీఎఫ్ ఏరియాలోని సివిల్ కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ.. క‌ర్నాట‌క‌ పైకోర్టుకి వెళ్ల‌డం ఈ సంద‌ర్భంగా టీమ్ కి లాభించిందనే చెప్పాలి. 2020లో ఈ సినిమా రిలీజ్ కానుంది. చెప్పిన టైముకే పూర్తి చేసి రిలీజ్ చేయాల‌న్న పంతంతో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ చాలా సీరియ‌స్ గా ప‌ని చేస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Tags:    

Similar News