బండిట్ క్వీన్ పూలన్ దేవి బయోపిక్.. ఎంత పని చేసారు?
కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ హద్దు మీరి ఎడిట్ కట్‌లతో విడుదల చేయడం చూసి మేకర్స్ నిజంగా షాక్ తిన్నారు. అయోమయంలో ఉండిపోయారు.;
ఫిలింమేకర్ చాలా ప్రసవ వేదన అనుభవించిన తర్వాతే ఏదైనా సినిమాని రిలీజ్ చేయగలడు. అలాంటిది పది సార్లు ప్రసవం అయిన తర్వాతే ఒక దర్శకనిర్మాత ఇలాంటి సినిమాని రిలీజ్ చేయగలిగారు. అలాంటి ఒక సినిమా బండిట క్వీన్. ఈ సినిమాని తెరకెక్కించిన బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు శేఖర్ కపూర్ అష్టకష్టాలు అనుభవించారు. సినిమాని రిలీజ్ చేయలేక నానా ఇబ్బందులు పడ్డారు. సెన్సార్ బోర్డు, హైకోర్టు, సుప్రీంకోర్టుతో కూడా పోరాటం సాగించాడు. చివరికి రిలీజ్ చేసాడు.
కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ హద్దు మీరి ఎడిట్ కట్‌లతో విడుదల చేయడం చూసి మేకర్స్ నిజంగా షాక్ తిన్నారు. అయోమయంలో ఉండిపోయారు. ఓటీటీలో చూశాక అసలు ఈ సినిమాకి జీవం ఎక్కడ ఉంది? అన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో చాలా కట్స్ - ఎడిట్‌లతో విడుదలైంది బండిట్ క్వీన్ సినిమా. రియల్ క్వీన్ పూలన్ దేవి జీవితకథతో రూపొందించిన ఈ సినిమా చాలా చర్చల్లో నిలిచింది. అయితే ఓటీటీలో చూశాక.. కనీసం దర్శకుడు కూడా ఇది నేను తీసిందేనా? అని సందేహించాల్సిన పరిస్థితి.
దీంతో శేఖర్ కపూర్ తన నిరాశను వ్యక్తం చేస్తూ ఎక్స్ లో ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సినిమాని తాను ఎలాంటి కఠిన పరిస్థితుల్లో చిత్రీకరించాడో.. నిర్మాణానంతర పనుల సమయంలో ఎడిటింగ్ టేబుల్ పై ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో కూడా వెల్లడించాడు. అయితే ఇంత చేస్తే, కనీసం మాత్రంగా తనను సంప్రదించకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ సినిమాని ఎడిట్ చేసి రిలీజ్ చేయడంతో షాక్ తిన్నానని అన్నారు.
సినిమా థీమ్‌ని చంపేసారు.. సారం తీసేశారని ఆవేదన చెందారు. నిర్మాతలు కునాల్ కోహ్లీ - హన్సల్ మెహతా కూడా ప్రైమ్ వీడియో ఇండియా నిర్ణయంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక శేఖర్ కపూర్ కి మరోసారి కునుకుపట్టనివ్వని రాత్రులు ఎదురవుతున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ వంటి అంతర్జాతీయ దర్శకుడికి కూడా అదే విధమైన ట్రీట్ ఇవ్వగలరా? అని ఆయన ప్రశ్నించాడు. భారతీయ దర్శకనిర్మాతలకు గౌరవం ఎందుకు ఇవ్వరో అంటూ ఆందోళన చెందారు.
బాండిట్ క్వీన్ 1995లో హిందీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 67వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా భారతదేశం అధికారిక ఎంట్రీగా నిలిచింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఎడిట్ చేసిన విధానం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓటీటీ కంటెంట్ సెన్సార్ షిప్ విషయంలో సమాచార ప్రసారాల శాఖ కొరడా ఝలిపిస్తున్నా కానీ, ఇలాంటి బయోపిక్ చిత్రాల విషయంలో కొన్ని పరిమితులను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని కొందరు సూచిస్తున్నారు.