స్టార్ హీరో బంగ్లాకు బుల్లెట్ ప్రూఫ్?
ఇదే సమయంలో అతడి బాంద్రా నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ రెనోవేషన్ తో మరింత భద్రంగా మార్చాలని సల్మాన్ ప్రయత్నిస్తున్నారు.
పంజాబీ గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ దడ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు అతడి నుంచి పెనుముప్పు పొంచి ఉంది. లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే పలుమార్లు అతడిపై ఎటాక్ లు ప్లాన్ చేసాడు. కొన్నిసార్లు సల్మాన్ ఊహించని విధంగా తప్పించుకున్నాడు. ఒకసారి బాంద్రాలోని నివాసంలో నిదురిస్తుండగా బుల్లెట్ల వర్షం కురిసింది. మరోసారి పన్వేల్ ఫామ్ హౌస్ లో రెక్కీ చేసాక పోలీసులు పసిగట్టడంతో సల్మాన్ బతికిపోయాడు. ఫామ్ హౌస్ లో తుపాకీ షూటింగ్ లో ట్రైనింగ్ అయిన పిల్లల్ని పంపి సల్మాన్ ని చంపాలనుకున్నారు. ఇంకా చాలా సార్లు సల్మాన్ ని లేపేయాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతడి చుట్టూ రెక్కీలు నిర్వహించింది. ఈ విషయాలన్నీ పట్టుబడిన నిందితుల ద్వారా రాబట్టిన పోలీసులు ఉలిక్కిపడ్డారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కట్టుదిట్టమైన వై కేటగిరీ భద్రత నడుమ షూటింగులకు వెళుతున్నాడు. ఇదే సమయంలో అతడి బాంద్రా నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ రెనోవేషన్ తో మరింత భద్రంగా మార్చాలని సల్మాన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అపార్ట్మెంట్ బాల్కనీ, కిటికీలలో మరమ్మత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం గేలాక్సీ కిటికీలను రిమూవ్ చేసి కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు. బాల్కనీకి నిర్మాణ మార్పులు చేస్తున్నారు. ఈ బాల్కనీ మీదుగా 30 రౌండ్ల బుల్లెట్లను గతంలో నిందితులు పేల్చారు.
గేలాక్సీ అనేది నిజానికి టూరిస్ట్ స్పాట్. సల్మాన్ తన అభిమానులను అలరించే పాపులర్ ప్లేస్. కానీ గ్యాంగ్ స్టర్ ముప్పు ఉండటంతో బాల్కనీలోని బ్లైండ్‌లు ఇప్పుడు కిందకు లాగి ఉన్నాయి. అభిమానులు నేరుగా భవనం ఎదురుగా గుమిగూడటాన్ని నిషేధించారు. సల్మాన్ ఇంటి చుట్టూ పోలీస్ పహారా కాస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ బయటకు వెళ్లేందుకు బుల్లెట్ ప్రూఫ్ కార్ ని ఉపయోగిస్తున్నారు. తన ఇంటిని కూడా బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తో కవర్ చేస్తున్నాడంటూ ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. ఏది ఏమైనా సల్మాన్ తన భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.
1998 కృష్ణ జింకలను వేటాడిన కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుండి సల్మాన్ ఖాన్‌కు హత్యా బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఏప్రిల్ 2024లో గుర్తుతెలియని దుండగులు తెల్లవారుజామున గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో సల్మాన్ తన ఇంటిలోనే క్షేమంగా ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత భవనం దగ్గర వాహనాలు ఆపకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. 12 అక్టోబర్ 2024న సల్మాన్ సన్నిహితుడు ఎన్సీపీ నాయకుడు, సల్మాన్ స్నేహితుడు బాబా సిద్ధిక్ హత్య తర్వాత పరిస్థితి మరింత తీవ్రమైంది. లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ హత్యకు బాధ్యత వహించింది. ఆ తర్వాతా సల్మాన్ కి మరింత బెదిరింపులు పెరిగాయి. సల్మాన్ కి ప్రస్తుతం 11 మంది సాయుధ సిబ్బంది కాపలా కాస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు రెండు ఎస్కార్ట్ వాహనాలు ఎల్లప్పుడూ వెంట వస్తున్నాయి. సల్మాన్ తదుపరి సికందర్ షూటింగ్ ని పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.