కోడి రామ్మూర్తి బయోపిక్ లో చరణ్.. ఎవరాయన?

క్రీడా నేపథ్యంలో చరణ్- బుచ్చి బాబు సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారని సమాచారం.

Update: 2024-02-04 07:54 GMT

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా నెలలు అయినా.. ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. వచ్చే నెలలో విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ సెట్స్ పై ఉండగానే.. చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత సెట్స్ మీదకు బుచ్చిబాబు- చరణ్ ప్రాజెక్ట్ ను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 400 మంది నటీనటులు కావాలని ఒక క్యాస్టింగ్ కాల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆడిషన్స్ పెడుతున్నామని, నటించాలని ఆసక్తి ఉన్న వారందరూ రావాలని పేర్కొన్నారు.

క్రీడా నేపథ్యంలో చరణ్- బుచ్చి బాబు సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారని సమాచారం. అందుకే చరణ్ ఆ ప్రాంతం యాస మీద దృష్టి సారించారట. నేర్చుకునే పనిలో ఉన్నారట. అయితే ఉత్తరాంధ్రకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా బుచ్చిబాబు స్టోరీ సిద్ధం చేశారని, తెరపై రామ్మూరి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి కోడి రామ్మూర్తి ఎవరంటే?

శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన కోడి రామూర్తి నాయుడు క‌లియుగ భీముడిగా పేరు సంపాదించుకున్నారు. చిన్న‌వ‌య‌సులోనే మ‌ల్ల‌యుద్ధంలో ఆరితేరేస్థాయికి చేరుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఛాతిపై ఒక‌టిన్న‌ర ట‌న్నుల బండ‌రాయిని మోసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. నెమ్మ‌ది నెమ్మ‌దిగా 3 టన్నుల భారాన్ని మోయ‌గ‌లిగే స్థాయికి చేరుకున్నారు.

శరీరానికి ఐరెన్ చైన్లు బిగించుకుని, ఊపిరి బిగించి వాటిని ముక్కముక్కలు చేయ‌డంలో రామ్మూర్తి నాయుడును మించిన వారు లేర‌నే చెప్పొచ్చు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని వాటిని శరవేగంగా నడపమనేవారు. కానీ, కార్లు క‌దిలేవి కాదు. చూసేందుకే భ‌య‌మ‌నిపించే ఏనుగును త‌న ఛాతీపై ఎక్కించుకుని కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచి ఆ బ‌రువంతా మోసేవారు. ఇలా రామ్మూర్తి త‌న విన్యాసాల‌తో ప్ర‌జ‌ల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నారు.

కోడి రామ్మూర్తి నాయుడు తెలుగు రాష్ట్రంలో ఎంతో మందికి వ్యాయామంతోపాటు బాడీ బిల్డింగ్ లో శిక్ష‌ణ ఇచ్చారు. ఇప్ప‌టికీ చాలా జిల్లాల్లో ఏర్పాటు చేసిన వ్యాయామశాల‌ల‌కు ఆయ‌న పేరునే పెట్టారు. ఇక రామ్ చరణ్ RC 16.. కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతుందో లేదో అన్న విషయం మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.


Tags:    

Similar News