వ్వాటే స్టైల్ గురూ.. UK నుంచి బాస్ ఈజ్ బ్యాక్
బాస్ ఈజ్ బ్యాక్..! ఆయనలోని ఛామ్ అంతకంతకు పెరుగుతుంటే, పురస్కారాలతో గౌరవం ఇనుమడిస్తుంటే ఎనర్జీ పదింతలు అవుతోంది.;
బాస్ ఈజ్ బ్యాక్..! ఆయనలోని ఛామ్ అంతకంతకు పెరుగుతుంటే, పురస్కారాలతో గౌరవం ఇనుమడిస్తుంటే ఎనర్జీ పదింతలు అవుతోంది. 60 ప్లస్ లో 30 మైనస్ ఛామ్ ని చూపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు రోజుల్ని గుర్తు చేస్తూ షాకిస్తున్నాడు.
అతడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? ది గ్రేట్ మెగాస్టార్ గురించే ఇదంతా. ఆయన ఇటీవలే బ్రిటీష్ ప్రభుత్వ పురస్కారాన్ని అందుకుని ఉత్సాహంగా కనిపిస్తున్నారు. యూకే ప్రభుత్వం నుండి `జీవిత సాఫల్య పురస్కారం` అందుకున్న తొలి భారతీయ సెలబ్రిటీగా మెగాస్టార్ చిరంజీవికి గొప్ప గౌరవం లభించింది. ఈ అవార్డును 19 మార్చి 2025న లండన్‌లోని యూకే పార్లమెంట్‌లో ప్రదానం చేశారు. సినిమా - సమాజానికి ఆయన చేసిన అద్భుతమైన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని బ్రిటన్ అందించింది. చిత్ర పరిశ్రమలో ఆయన ప్రయాణం ప్రజల జీవితాలపై ఆయన చూపిన ప్రభావానికి దక్కిన గుర్తింపు ఇది.
నాలుగు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనితర సాధ్యమైనవి. చిరు తన సినిమాలతో కోట్లాది మంది ప్రజలను అలరించారు. సమాజానికి అద్భుత సేవలందించారు. ఆయన స్వచ్ఛంద సంస్థ, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT), ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, విద్య రంగాలలో చాలా మందికి సహాయం చేసింది. ఆయన ప్రయత్నాలు నటనకు మించి, ప్రజా జీవితాల్లో నిజమైన మార్పును తెచ్చిపెట్టాయి.
కరోనా క్రైసిస్ సమయంలో చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ దాదాపు 60కోట్లు ఖర్చు చేసి రోగుల కోసం ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, ఇతర ఖరీదైన పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సేవ కోసం కేటాయించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ లు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిరు అభిమానులు నిరంతరం ప్రజాసేవకే అంకితమవ్వడంలో చిరు ప్రోద్భలం ఎంతో ఉంది. ఇక చిత్రపరిశ్రమలో కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆర్థిక విరాళాలు ఇవ్వడంలోను చిరు ఎప్పుడూ ముందున్నారు. యూకే నుంచి తిరుగు ప్రయాణం అవుతూ చిరంజీవి ఇదిగో ఇలా లండన్ విమానాశ్రయంలో స్టైలిష్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది. చిరు ఇస్టయిల్ చూసి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.