దెబ్బకి పైరసీ చెయ్యాలనే ఆలోచన కూడా రాదు!
ఇంతకుముందులా ఇప్పుడు సినిమాల్ని యథేచ్ఛగా థియేటర్లలో పైరసీ చేస్తే, వీడియో షూట్లు చేస్తే ఇకపై శిక్ష నుంచి తప్పించుకోవడం కుదరదు
ఇంతకుముందులా ఇప్పుడు సినిమాల్ని యథేచ్ఛగా థియేటర్లలో పైరసీ చేస్తే, వీడియో షూట్లు చేస్తే ఇకపై శిక్ష నుంచి తప్పించుకోవడం కుదరదు. రూల్స్ మారాయి. ప్రభుత్వాలు కఠిన నియమాల్ని అమలు చేయనున్నాయి. ఆ మేరకు సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరించడం సంచలనమైంది. ఇటీవల సినిమాటోగ్రఫీ బిల్లులో సినిమాల పైరసీ కాపీలను రూపొందించే వ్యక్తులకు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష .. సుమారు 3లక్షల మేర జరిమానా విధించేందుకు రూల్ పాస్ అయింది. సినిమా నిర్మాణ వ్యయంలో ఐదు శాతం వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా ఈ రూల్ అమల్లోకి వచ్చిందని తెలుస్తోంది.
సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గతంలో రాజ్యసభలో ప్రవేశపెట్టిన సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లు-2023 కూడా 10 ఏళ్ల కాలపరిమితిని రద్దు చేయడం ద్వారా శాశ్వత చెల్లుబాటుతో కూడిన బిల్లును ప్రతిపాదించింది. ఇక సినిమాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేట్ సవరణ ప్రకారం మంజూరు చేయాలని ప్రతిపాదించింది. అలాగే బూజు పట్టిన పాతకాలపు సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు-2019ని కూడా ఉపసంహరించిన సంగతి తెలిసిందే.
సినిమా పైరసీని అరికట్టడానికి, సినిమాటోగ్రాఫ్ చట్టంలో సినిమాల అనధికార రికార్డింగ్ (సెక్షన్ 6AA) , వాటి ప్రదర్శన (సెక్షన్ 6AB)ని నిషేధించే నిబంధనలతో కొత్త సెక్షన్లను ప్రవేశపెట్టాలని బిల్లులో కోరారు.
బిల్‌లోని కఠినమైన కొత్త నిబంధన 6AA ..ఏదైనా వస్తువుతో రికార్డింగ్‌ను ఉపయోగించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఫిల్మ్ లేదా దానిలోని ఏదైనా భాగాన్ని రికార్డ్ చేయడాన్ని నిషేధిస్తుంది. ఎవరైనా వ్యక్తి సెక్షన్ 6AA లేదా సెక్షన్ 6AB నిబంధనలను ఉల్లంఘిస్తే, అతను మూడు నెలల కంటే తక్కువ కాకుండా జైలు శిక్షకు గురవుతాడు. కానీ దీనిని సీరియస్ నెస్ ని బట్టి మూడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు . మూడు లక్షల కంటే తక్కువ జరిమానా విధించాలనేది కూడా నియమం. అయితే ఆడిట్ చేయబడిన స్థూల ఉత్పత్తి వ్యయంలో ఐదు శాతానికి విస్తరించవచ్చు అని కూడా ఆ బిల్లు పేర్కొంది. ప్రతిపాదిత సవరణలు ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రభావవంతంగా పని చేస్తాయని భావిస్తున్నారు.
చలనచిత్ర పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడానికి, ఈ రంగంలో ఉద్యోగాల కల్పనను పెంచడానికి సహాయపడతాయి అని కూడా చెబుతున్నారు. ఇప్పటికే సినిమాటోగ్రఫీ బిల్లు పాస్ అయింది గనుక.. ఇక థియేటర్లలో పైరసీ చేసేవారికి ఇది ప్రమాదకరంగా మారుతుందని భావిస్తున్నారు. అయితే స్వదేశంలో వీడియో రికార్డింగులను పట్టుకోగలిగినా విదేశాల నుంచి సినిమాలను కాపీయింగ్ చేస్తున్న వారిని పట్టుకోవడం ఎలా? పైరసీలో దొరకని పెద్ద దొంగ అయిన తమిళ రాకర్స్ ఆగడాలను ఆపేదెలా? అంటూ పరిశ్రమలో చర్చ సాగుతోంది. కేవలం భారతదేశంలోని పెద్ద నగరాల నుంచి పైరసీని ఆపేందుకు అధికారులు ప్రయత్నిస్తారు. వారి ఆఫీసుల పరిధిలోనే ఇది సాధ్యమవుతుంది. కానీ మారుమూల నుంచి సినిమాల కాపీయింగ్ ని అరికట్టేదెలా? అనేది కూడా చర్చగా మారింది.
వయసుల వారీగా నియమాలు:
ఈ బిల్లు UA కేటగిరీలో వయస్సు-ఆధారిత ధృవీకరణను UA 7+, UA 13+ , UA 16+ మూడు వయో-ఆధారిత కేటగిరీలుగా ప్రవేశపెట్టాలని, సినిమాని మంజూరు చేయడానికి CBFCకి అధికారం ఇవ్వాలని కోరింది. టెలివిజన్ లేదా ఇతర మీడియాలో ప్రదర్శన కోసం ప్రత్యేక సర్టిఫికేట్ ని జారీ చేయాలని కూడా ధృవీకరించారు.