మోస‌గాళ్ల వ‌ల్లో ప‌డొద్దు: తెలుగు ఫిలింఛాంబ‌ర్

అయితే అవ‌కాశం పేరుతో వల వేసిన మాయ‌గాడికి సినీప‌రిశ్ర‌మ‌తో ఎలాంటి సంబంధం లేద‌ని తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

Update: 2024-08-02 15:06 GMT

సినీ అవ‌కాశాల పేరుతో హైద‌రాబాద్ గ‌చ్చిబౌళిలో సాఫ్ట్ వేర్ అమ్మాయి అత్యాచారానికి బ‌లైన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే అవ‌కాశం పేరుతో వల వేసిన మాయ‌గాడికి సినీప‌రిశ్ర‌మ‌తో ఎలాంటి సంబంధం లేద‌ని తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఆ మేర‌కు ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు పి.భ‌ర‌త్ భూష‌ణ్‌, కె.ఎల్. దామోద‌ర ప్ర‌సాద్-శివ‌ప్ర‌సాద‌రావు సంయుక్తంగా ఒక ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసారు. ఆ ప్ర‌క‌ట‌న సారాంశం ఇలా ఉంది.

''తెలుగు సినిమా పరిశ్రమలో సహాయ దర్శకుడుగా పనిచేస్తున్నానని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక యువతిని సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి, మానభంగం చేసిన సిద్ధార్థ వర్మ అనే వ్యక్తి ప‌రిశ్ర‌మ వ్య‌క్తి కాదు. ఈ వార్త‌ల్ని పత్రికలు, టీవీలు ద్వారా తెలుసుకొని తెలుగు ఫిలిం ఛాంబర్ .. ద‌ర్శ‌క‌సంఘాన్ని సంప్ర‌దించింది. అసోసియేషన్ ప్ర‌తినిధులు.. సిద్దార్థ వర్మ తమ సభ్యుడు కాదని, అతను ఏ దర్శకుడు దగ్గర సహాయకుడిగా పనిచేయడం లేదని తెలిపారు`` అని నోట్ వెల్ల‌డించింది.

ముఖ్యంగా సినిమాల్లో వేషాలు వేయాలని తాపత్రయ పడే యువతులు ఇటువంటి వారిని దగ్గరకు రానివ్వకూడదని, ఇలాంటి వ్యక్తుల చర్యలకు అమ్మాయిలు అనాలోచితంగా ఉండవద్దని ఫిలించాంబ‌ర్ మ‌న‌వి చేసింది. ఇటువంటి సంఘటనలను ఆడపిల్లలు ఒక హెచ్చరికగా భావించాలని కోరుకుంటూ, ఫిలిం ఇండస్ట్రీలో పనిచేయాలన్న ఉత్సాహంతో వస్తున్న వారు మగవారైనా, ఆడవారైనా ఇటువంటి మోసపూరితమైన సంఘటనలకు బలి కాకుండా వారు చెప్పే మాటలను నమ్మకుండా, ఇటువంటి విషయాల మీద ఆచి తూచి తెలుసుకుని పెద్దల సలహాతో అడుగు వేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ విజ్ఞప్తి చేస్తోందని వెల్ల‌డించారు.

ఈ కేసు వివ‌రాల్లోకి వెళితే... ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో గ‌చ్చిబౌళి-పుప్పాలగూడలో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై సిద్ధార్థ్ వర్మ అనే అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో పాటు నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్య‌క్త‌మైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి సిద్ధార్థ్‌ వర్మ బాధితురాలికి ఎర వేసి మోసం చేశాడు. అతని మాటలు నమ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతన్ని కలవడానికి అంగీకరించింది. అయితే ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకున్న సిద్ధార్థ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News