ఇండియాలోనే నెం.1.. 'పుష్ప 2' తగ్గేదేలే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''పుష్ప 2: ది రూల్''. ఇది 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''పుష్ప 2: ది రూల్''. ఇది 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో, ఇప్పుడు అందరూ సెకండ్ పార్ట్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2' నిలిచింది.
ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ - IMDB) తాజాగా 2024లో సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్-10 ఇండియన్ సినిమాల జాబితాను ప్రకటించింది. ఇందులో 'పుష్ప 2: ది రూల్' చిత్రం అగ్ర స్థానంలో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న 'దేవర 1' మూవీ రెండో స్థానాన్ని ఆక్రమించింది. అక్షయ్ కుమార్ నటిస్తున్న హిందీ చిత్రం 'వెల్ కమ్ టూ ది జంగిల్' థర్డ్ ప్లేస్ లో ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) మూవీ నాలుగో స్థానాన్ని సంపాదించింది.
తమిళ హీరో సూర్య, సిరుతై శివ కాంబోలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్ లిస్టులో ఐదో ప్లేస్ లో నిలిచింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, దీపికా పదుకునే, కరీనా కపూర్ ఖాన్ కలిసి నటిస్తున్న హిందీ సినిమా 'సింగం అగైన్' ఆ తర్వాతి స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ చేస్తున్న హారర్ కామెడీ మూవీ 'భూల్ భూలయ్యా 3' ఏడో స్థానాన్ని సాధించింది. చియాన్ విక్రమ్, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'తంగలాన్' ఐఎండీబీ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది.
అజయ్ దేవగన్, టబు కలిసి నటించిన 'ఔరోన్ మే కహన్ దమ్ థా' సినిమా 9వ ప్లేస్ లో ఉండగా.. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'స్త్రీ 2' చిత్రం ఈ లిస్టులో చివరి ప్లేస్ లో ఉంది. 2024 జనవరి 1 నుంచి 2024 జూలై 10 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది విజిటర్స్ వాస్తవ పేజీ వ్యూస్ ఆధారంగా ఈ జాబితా రూపొందించినట్లుగా IMDB పేర్కొంది. అయితే ఈ లిస్టులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతున్న 'గేమ్ చేంజర్' సినిమాకి ఈ జాబితాలో చోటుదక్కకపోవడం గమనార్హం.
ఇకపోతే 2021 డిసెంబర్ లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై, సంచలనం సృష్టించింది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు పాన్ ఇండియా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇదే 69 ఏళ్లుగా టాలీవుడ్ కు అందని ద్రాక్షగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో 'తగ్గేదే లే' అనే బన్నీ మేనరిజం.. ఆయన పలికిన 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్' వంటి డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల దగ్గర నుంచి సినీ క్రీడా సెలబ్రిటీల వరకూ అందరి దృష్టిని ఆకర్షించారు. అందుకే ఇప్పుడు ''పుష్ప 2: ది రూల్'' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే ఐఎండీబీ ద్వారా మరోసారి స్పష్టమైంది.
2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2' నిలిచిన నేపథ్యంలో చిత్ర బృందం ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. 'తగ్గేదే లే' అంటూ పుష్పరాజ్ టైటిల్ సాంగ్ క్లిప్పింగ్ ని షేర్ చేసింది. ఈ సందర్భంగా డిసెంబర్ 6న తేదీన వరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 'పుష్ప 2: ది రూల్' మూవీ కచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.