మొసలితో ఫైట్‌... నీళ్లలో వారం పాటు స్టార్‌ హీరో!

సూర్య హీరోగా దిశా పటానీ హీరోయిన్‌గా శివ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ మూవీ కంగువా పై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2024-10-25 12:30 GMT

తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు, హిందీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కంగువా సినిమా నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ బాహుబలి అని, మొదటి తమిళ ఇండస్ట్రీకి చెందిన వెయ్యి కోట్ల మూవీ అంటూ కంగువా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సూర్య హీరోగా దిశా పటానీ హీరోయిన్‌గా శివ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ మూవీ కంగువా పై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న కారణంగా అంచనాలు మరింత పెరిగాయి అనడంలో సందేహం లేదు.

కంగువా సినిమా ప్రమోషన్ ను సూర్య పాన్‌ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. ఇటీవల ముంబైలో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తాజాగా హైదరాబాద్‌ లో ప్రెస్ మీట్‌ పెట్టడంతో పాటు, బాలకృష్ణ టాక్ షో అన్‌ స్టాపబుల్‌ లో పాల్గొన్నాడు. ఆహా ఓటీటీ ద్వారా ఆ టాక్‌ షో ప్రేక్షకుల ముందుకు సినిమా విడుదల సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తాజాగా దర్శకుడు శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా కోసం సూర్య పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు. మరే హీరో అయినా కొన్ని సన్నివేశాల్లో చేతులు ఎత్తేసేవారు. బాబోయ్‌ నా వల్ల కాదని అనేవారట. కానీ సూర్య మాత్రం ఎంత కష్టం అయినా ముందుగా అనుకున్న ప్రకారం యాక్షన్‌ సన్నివేశాలను పూర్తి చేశాడట.

ముఖ్యంగా సినిమాలో ఒక సన్నివేశంలో హీరో సూర్య మొసలితో పోరాటం చేయాల్సి ఉంటుందట. ఆ సన్నివేశంను బ్యాంకాక్ లో చిత్రీకరించాం. సినిమాలో ఆ సీన్ హైలైట్‌ గా ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా కష్టపడ్డాం. వెయ్యి మందికి పైగా ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌ లో పాల్గొన్నారు. వారం రోజుల పాటు నీళ్లలోనే సూర్య ఉండి మొసలితో ఫైట్‌ చేయాల్సి వచ్చింది. ఒక హీరో అదీ స్టార్‌ హీరో వరుసగా వారం రోజుల పాటు నీటిలో ఉండటం అంటే మామూలు విషయం కాదు. సూర్య ను చాలా ఎక్కువ కష్టపడుతున్నాం అనిపించింది. ఆ సన్నివేశాన్ని మధ్యలో వదిలేయాలని అనుకున్నా సూర్య సర్‌ మాత్రం వదల్లేదు. ముందుగా అనుకున్నట్లు దాన్ని కంప్లీట్‌ చేశారు అన్నారు.

కంగువా సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నాడు. టీజర్‌, పోస్టర్స్ చూస్తే ఆ విషయం క్లారిటీ వస్తుంది. ఒక టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించారు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం రెండు విభిన్న కాలాలకు చెందిన వ్యక్తిగా సూర్య కనిపించబోతున్నాడు. ఆ రెండు కాలలను దర్శకుడు ఎలా కలిపి సినిమాను ఆసక్తికరంగా మలిచాడు అనేది కథ. సినిమాకు తెలుగు లో భారీ బిజినెస్ జరిగింది. త్వరలోనే సినిమా నుంచి అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ వస్తుందనే చర్చ జరుగుతోంది. సూర్య కెరీర్‌ లోనే ఇది బిగ్గెస్ట్‌ మూవీ. మరి తమిళ సినీ చరిత్రలో ఇది బిగ్గెస్ట్‌ మూవీగా నిలుస్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News